కరోనాపై కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. కేంద్ర ఆరోగ్య శాఖ ఈరోజు హై లెవెల్ సమావేశం నిర్వహిస్తోంది. దేశంలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ముందస్తు చర్యల గురించి ప్రధానంగా చర్చ జరగనుంది. చికిత్స కోసం 2500 మందికి చికిత్స అందేలా ప్రత్యేక ఆస్పత్రి ఏర్పాటుతో పాటు ల్యాబ్ ఏర్పాటు కోసం చర్చ జరగనుందని సమాచారం. రెండు రోజుల నుండి దేశంలో కరోనా అనుమానితుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. 
 
తెలుగు రాష్ట్రాల్లో కరోనా అనుమానితుల సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్ లో ఇప్పటికే ఓ వ్యక్తి కరోనా భారీన పడి చికిత్స పొందుతుండటంతో వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. బాధితుడి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా కరోనా బాధితులకు ప్రత్యేక ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. 
 
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ కరోనా కలకలం రేపుతోంది. ఎల్లారెడ్డిపల్లికి చెందిన ఒక వ్యక్తిలో కరోనా లక్షణాలు కనిపించడంతో అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో కరోనా కలకలం రేపింది. ఇటీవల దక్షిణ కొరియా వెళ్లొచ్చిన కొత్తపేట మండలం వాడాయిపేటకు చెందిన బండారు వెంకటేశ్వర్లు అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిలో కరోనా లక్షణాలు ఉన్నట్టు డాక్టర్లు గుర్తించారు. 
 
ప్రస్తుతం వెంకటేశ్వర్లుకు కాకినాడ జీజీహెచ్ లో చికిత్స జరుగుతోంది. ప్రత్యేక వార్డులో వైద్యులు ఇతనికి చికిత్స అందిస్తున్నారు. కేంద్రం దేశంలో కరోనా కేసులు బయటపడిన నేపథ్యంలో ఇటలీ, ఇరాన్, జపాన్, దక్షిణ కొరియా దేశాలకు జారీ చేసిన వీసాలను రద్దు చేసింది. దక్షిణ కొరియా, జపాన్ దేశాలకు చెందిన వారికి వీసా ఆన్ అరైవల్స్ ను కూడా కేంద్రం రద్దు చేసింది.      
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: