భారత్‌ లో కరోనా వైరస్ మహమ్మారి క్రమంగా విస్తరిస్తోంది. రెండు రోజుల కిందట ఢిల్లీ, హైదరాబాద్‌ లో ఇద్దరికి కోవిడ్ నిర్ధారణ కాగా, మంగళవారం ఇటలీ నుంచి వచ్చి పర్యాటకుడికి వైరస్ నిర్ధారణ అయ్యింది. తాజాగా, ఐటీబీపీ కేంద్రంలోని పర్యవేక్షణలో ఉన్న 21 మందిలో 15 మంది నమూనాల్లో కోవిడ్ ఉన్నట్టు తేలింది. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 18కి చేరింది. గత నెలలో కేరళకు చెందిన ముగ్గురికి కరోనా వైరస్ సోకడంతో చికిత్స అనంతరం కోలుకున్న బాధితులను ఇళ్లకు పంపారు. వారితో కలిసి దేశంలో కరోనా కేసులు 18గా గుర్తించారు.

 

 

కొచ్చిన్ తీరంలో నిలిపి ఉన్న ఇటలీ పర్యాటక నౌక కోస్టా 459 ప్రయాణికులకు కిందికి దించి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. నౌకలో 305 మంది భారతీయులు సహా 459కి రోగ నిరోధక వ్యవస్థ, జ్వర పరీక్షలు చేయనున్నట్టు కోచి పోర్ట్ ట్రస్ట్ పీఆర్‌ఓ జిజో థామస్ వెల్లడించారు. దేశంలో కరోనా వైరస్ కేసులు, తీసుకుంటున్న చర్యల గురించి ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురిచెందాల్సిన అవసరం లేదని అన్నారు.

 

 

ఏపీలో కరోనా వైరస్ కలకలం రేగింది. ఇటీవల దక్షిణ కొరియా వెళ్లి వచ్చిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి కరోనా సోకినట్లు అనుమానిస్తున్నారు. హైదరాబాద్‌లోని సాఫ్ట్‌ వేర్‌ సంస్థలో విధులు నిర్వర్తించే యువకుడు ఇటీవలే దక్షిణకొరియా వెళ్లి తిరిగి వచ్చాడు. అనంతరం స్వగ్రామానికి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న హైదరాబాద్‌లోని అధికారులు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌‌కు సమాచారం ఇవ్వడంతో జిల్లా అధికారులు, ఆరోగ్యశాఖ సిబ్బంది అప్రమత్తమై అనుమానిత వ్యక్తిని గుర్తించి కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు.

 

 

కరోనా వైరస్‌ కారణంగా సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లోని మహేంద్రహిల్స్‌లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కోవిడ్‌-19 సోకి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగి ఇదే ప్రాంతవాసి కావడంతో కంటోన్మెంటు అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పాఠశాలల యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. ఇప్పటికే మహేంద్రహిల్స్‌ ప్రాంతంలో ముమ్మరంగా పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. దుబాయి నుంచి బెంగళూరుకు అక్కడి నుంచి మహేంద్రహిల్స్‌లోని తన ఇంటికి చేరుకున్నాడు. అయిదు రోజులపాటు కాలనీలోనే ఉన్నాడు. ఆ సమయంలో ఎక్కడెక్కడ తిరిగాడు?ఎవరెవర్ని కలిశాడు?తదితర విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: