ఆంధ్ర ప్రదేశ్ లో అప్పుడే స్థానిక సంస్థల హడావుడి మొదలయింది . ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల  ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయం తో ఉన్నది . లేకపోతే  స్థానిక సంస్థలకు 14 వ ఆర్ధిక సంఘం నిధులు విడుదలయ్యే అవకాశాలు లేవు . అందుకే ఈ నెల చివరి వారం లో స్థానిక సంస్థలకు ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది .   ఈసారి ఎన్నికల్లో డబ్బు , మద్యం పంపిణి ని అరికట్టేందుకు జగన్ సర్కార్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న తరుణం లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే , ఓటర్లను మచ్చిగా చేసుకునే పనిలో ఆశావాహులు నిమగ్నమయినట్లు తెలుస్తోంది .

 

ఎన్నికల్లో విజయం సాధించడానికి అవసరమైన ఓట్ల కొనుగోలుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం . ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాత డబ్బులు , మద్యం పంపిణి చేసినట్లు తేలితే అభ్యర్థి పై అనర్హత వేటు పడే అవకాశముండడం వల్లే , ముందస్తుగానే ఆశావాహులు డబ్బుల పంపిణీకి తెర లేపినట్లు తెలుస్తోంది . సాధారణ ఎన్నికలతో పోలిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమే అవుతుంది . ఎందుకంటే ఒక అభ్యర్థి గెలుపు, ఓటములను ఒకటి , రెండు ఓట్లు శాసించిన దాఖలాలు లేకపోలేదు . స్థానిక సంస్థల్లో గెలుపు ఎన్ని ఓట్లు అవసరమో లెక్కగట్టుకుంటున్న ఆశావాహులు , ఆ ఓట్లను కొనుగోలు చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది .

 

ఒకవేళ రేపు ఏదైనా కారణం వల్ల, సదరు వ్యక్తి  కాకుండా మరొక అభ్యర్థి బరిలోకి దిగితే  , ముందస్తుగానే డబ్బులు పంపిణి చేసిన వ్యక్తికి సదరు అభ్యర్థి ఆ డబ్బులు ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు సమాచారం . ఇక ఎన్నికల సమయం లో కాకుండా సాధారణ సమయం లో డబ్బులను పంపిణి చేస్తే , ఆ డబ్బులు ఎన్నికల కోసమే పంపిణి చేసినట్లుగా నిరూపించడం అసాధ్యమని భావిస్తోన్న ఆశావాహులు, ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమైనట్లు ప్రచారం జరుగుతోంది .   

మరింత సమాచారం తెలుసుకోండి: