ఇప్పటికే అరెస్టయిన కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు. రేవంత్‌తో పాటు ఆయన సోదరుడు, అనుచరులను నార్సింగి పోలీసులు అరెస్ట్‌ చేసి ఉప్పర్‌పల్లి న్యాయస్థానానికి తీసుకెళ్లారు. అనుమతి లేకుండా డ్రోన్‌ ఎగురవేశారన్న కేసులో అరెస్టయిన ఎంపీ రేవంత్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు. ఉప్పర్‌పల్లి న్యాయస్థానం రేవంత్ కు 14 రోజుల రిమాండ్‌ విధించింది.

 

 

ఆ తర్వాత పోలీసులు రేవంత్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు. అసలు ఇంతకీ ఈ కేసు ఏంటి.. ఈ డ్రోన్‌లు ఏంటి.. డ్లోన్లు ఎగరేస్తే అరెస్టు చేయడమేంటి.. ఓ సారి చూద్దాం.. కొన్ని రోజులుగా తెలంగాణలో రేవంత్ రెడ్డి వర్సెస్ టీఆర్ ఎస్ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి భూ అక్రమాలుపై దృష్టి సారించిన ప్రభుత్వం కొన్ని లొసుగులు గమనించింది. వాటి ఆధారంగా విచారణ ముమ్మరం చేసింది. దీంతో రేవంత్ రెడ్డి రాజకీయంగా ఇరకాటంలో పడ్డారు.

 

అందుకే ఆయన కేటీఆర్, కేసీఆర్ ఆస్తులపై కన్నేశారు. కేటీఆర్ ఫామ్ హౌజును చూపిస్తానంటూ మీడియాను వెంటబెట్టుకుని వెళ్లి హడావిడి చేశారు. ఇదే సమయంలో రంగారెడ్డి జిల్లా జన్వాడలో అనుమతి తీసుకోకుండా డ్రోన్‌ ఎగురవేశారనే వ్యవహారంలో రేవంత్‌తో పాటు ఆయన సోదరుడు, మరికొంత మంది అనుచరులపై నార్సింగ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదైన నేపథ్యంలో రేవంత్‌ నార్సింగ్‌ పీఎస్‌కు వెళ్లారు.

 

 

మాదాపూర్‌ ఏసీపీ, నార్సింగ్‌ సీఐ రేవంత్‌ ను కొద్ది సేపు విచారించారు. రేవంత్‌తో పాటు ఆయన అనుచరులను అరెస్ట్‌ చేసి ఉప్పర్‌పల్లి న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు. అయితే ఇదంతా రాజకీయ కక్ష సాధింపేనంటోంది కాంగ్రెస్ పార్టీ. ఇష్టానుసారంగా ఒక ఎంపీని అరెస్ట్‌ చేయడమేంటని రేవంత్‌ అరెస్ట్‌ను పలువురు కాంగ్రెస్‌ నేతలు ఖండించారు. తెలంగాణ రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన నడుస్తోందని విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: