సమాజంలో కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న జంటలు సామాజిక చిక్కులు ఎదుర్కొంటున్నాయి. కులాంతర, మతాంతర వివాహాలకు సమాజంలో ఆమోదం లభించడం లేదు. కొన్ని సందర్భాల్లో ఇలాంటి వివాహాలు పరువు హత్యలకు దారి తీస్తున్నాయి. దేశంలో ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో ఈ వివాహాల పట్ల అభ్యంతరాలు ఉన్నాయి. సమాజంలో ఇలాంటి వివాహాల పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. 
 
ఇటువంటి క్రమంలో కేరళ ప్రభుత్వం కులాంతర, మతాంతర వివాహాలు చేసుకునే వారి కోసం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇలాంటి వివాహాలు చేసుకునే వారికి భరోసా కల్పిస్తూ భద్రతా గృహాలను నిర్మిస్తోంది. కేరళ ఆరోగ్య, న్యాయశాఖ మంత్రి కెకె శైలజ మాట్లాడుతూ సేఫ్ హోమ్స్ పేరుతో కులాలకు, మతాలకు అతీతంగా పెళ్లి చేసుకున్న దంపతులకు అండగా నిలిచేందుకు భద్రతా గృహాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. 
 
కేరళలో కొన్ని రోజుల క్రితం అగ్ర కులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న దళిత యువకుడు హత్యకు గురయ్యాడు. యువతి కుటుంబ సభ్యులు యువకుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన కేరళ రాష్ట్రమంతటా కలకలం రేపింది. యువకుడి దారుణ హత్య జరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలకు పూనుకుంది. మంత్రి నవ దంపతులు సేఫ్ హోమ్స్ లో సంవత్సరం పాటు ఉండొచ్చని తెలిపారు. 
 
ప్రభుత్వం వీరికి 35,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుందని చెప్పారు. కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్నవారికి భద్రత కల్పించడమే సేఫ్ హోమ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అని అన్నారు. ప్రేమ పెళ్లిళ్లను ప్రోత్సహించడం ప్రభుత్వం విధి అని చెప్పారు. పెళ్లి చేసుకున్న వారిలో ఎవరైనా షెడ్యూల్డ్ కులాలు లేదా షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారు ఉంటే వారికి 75,000 రూపాయల అదనపు సాయం అందుతుందని ఆమె తెలిపారు. ఎన్జీవోల సహకారంతో సేఫ్ హోమ్స్ నిర్మాణం జరుగుతోందని ఆమె చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: