గత కొన్ని రోజుల నుండి తెలంగాణలో కరోనా వార్తలు కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. కరోనాపై ప్రజల్లో నెలకొన్న భయాందోళనను మెడికల్ షాప్ యజమానులు క్యాష్ చేసుకుంటున్నారు. కొన్ని ఫార్మసీలలో 20 రూపాయలకు విక్రయించాల్సిన ఎన్ 95 ఫేస్ మాస్క్‌లను 200 రూపాయలకు విక్రయిస్తున్నారు. రెండు పొరలు ఉన్న రూపాయిన్నరకు విక్రయించాల్సిన మాస్క్‌లను 20 రూపాయల నుండి 30 రూపాయల వరకు అమ్ముతున్నారు. 
 
కొన్ని ప్రాంతాలలో మాస్క్‌ల కృత్రిమ కొరత సృష్టించి అమ్మకాలు సాగిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఆందోళనల నేపథ్యంలో హైకోర్టు ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. శానిటైజర్లు, మాస్క్‌లు ఉచితంగా పేదలకు రేషన్ దుకాణాల ద్వారా అందించాలని సూచించింది. రైల్వే స్టేషన్లలోను, ప్రధాన బస్టాండ్లలోను స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వం మురికివాడలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరింది. 
 
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఉచితంగా మాస్క్‌లు పంపిణీ చేయనున్నట్టు తెలుస్తోంది. మాస్క్‌ల కొరత వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ప్రభుత్వం మాస్క్‌ల పంపిణీ చేయడం శుభవార్త అనే చెప్పవచ్చు. ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు చేపడుతోంది. కరోనా వ్యాప్తితో మార్కెట్ లో మాస్క్‌లు, శానిటైజర్లకు తీవ్రమైన డిమాండ్ ఏర్పడింది, 
 
కొన్ని ప్రాంతాలలో మాస్క్‌లు లభ్యమవుతున్నా వాటి ధరలు చూసి ప్రజలు వెనక్కు తగ్గుతున్నారు. వైద్యులు ప్రజలకు సాధారణ మాస్క్‌లు చాలని ఎన్ 95 మాస్క్‌లు అవసరం లేదని చెబుతున్నారు. మాస్క్‌లు జలుబు, దగ్గు, జ్వరం ఉన్నవారు ధరించాలని సూచిస్తున్నారు. కరోనా బాధితులకు వైద్య సేవలందించే వారికి మాత్రమే ఎన్ 95 మాస్క్‌లు అవసరం అని ఇతరులకు అవసరం లేదని చెబుతున్నారు. మరోవైపు గాంధీ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బందికి అవసరమయ్యే ఎన్ 95 మాస్క్‌లు, సాధారణ మాస్క్‌లు, ఇతర వస్తువుల కోసం అధికారులు ఇండెంట్ పెట్టారు. అధికారులు గాంధీలో చికిత్స అందించే సిబ్బంది, వైద్యులకు పూర్తి రక్షణ కల్పించే అంశంపై దృష్టి పెట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: