ఏపీలో గత కొన్ని రోజుల నుండి రాజకీయ పార్టీలు, ఏపీ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచుస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. అధికారులు ఈరోజు మున్సిపల్ ఎన్నికలతో పాటు పంచాయతీ ఎన్నికలకు, జడ్పీటీసీ... ఎంపీటీసీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో స్థానిక పోరుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో మూడు దఫాలుగా ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. 
 
ఎన్నికల కమిషన్ 660 జడ్పీటీసీ స్థానాలకు, 9639 ఎంపీటీసీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించబోతున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఈ నెల 21న జరగనుండగా 24న ఫలితాలను ప్రకటిస్తారు. ఈ నెల 23న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహించి 27న ఫలితాలను వెల్లడిస్తారు. తొలి విడత పంచాయితీ ఎన్నికలు 27న జరగనుండగా రెండో విడత 29న జరగనున్నాయి. 
 
ఏపీ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన కొత్త ఆర్డినెన్స్ ద్వారా ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ను విడుదల చేసింది. షెడ్యూల్ విడుదలైన మరు క్షణమే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ప్రభుత్వం ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఓటర్లను ప్రభావితం చేసే కొత్త పథకాలను అమలు చేయరాదు. కలెక్టర్లకు, ఎస్పీలకు ఎన్నికలు సజావుగా జరగడానికి ఎన్నికల కమిషన్ అధికారాలు ఇచ్చింది. 
 
ఎన్నికల కమిషన్ అవసరమైతే అంగన్ వాడీ వర్కర్లను ఎన్నికల నిర్వహణ కోసం వినియోగించుకోనుంది. జడ్పీటీసీ, ఎంపీసీ ఎన్నికలకు ఈరోజు నోటిఫికేషన్ విడుదల కాగా మార్చి 9 నుంచి 11వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. మార్చి 12న నామినేషన్ల పరిశీలన కాగా మార్చి 14ను నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీగా అధికారులు నిర్ణయించారు. మార్చి 21న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా 24న ఓట్ల లెక్కింపు జరగనుంది. 
 
మార్చి 9న మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 11నుంచి 13వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. మార్చి 14న నామినేషన్ల పరిశీలన జరగనుండగా 16వ తేదీలోగా అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. మార్చి 23న ఎన్నికల పోలింగ్ జరగనుండగా 27న ఓట్ల లెక్కింపు జరగనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: