బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆయన ఎస్సీ కాదంటూ దళిత సంఘాలు రాష్ట్రపతికి ఫిర్యాదు చేశాయి. గతంలో క్రైస్తవ మతం స్వీకరించిన సురేష్ ఎస్సీ రిజర్వడ్ పార్లమెంట్ అయిన బాపట్ల నుంచి ఎలా పోటీ చేస్తారని విమర్శలు చేశాయి. ఇక తక్షణమే విచారణ జరిపి సురేష్‌పై చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతిని లేఖలో కోరాయి. అయితే జగన్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే సురేష్...2019 ఎన్నికల్లో బాపట్ల ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు.

 

ఇక ఆయన గెలిచిన దగ్గర నుంచి ఏదొక వివాదంలో చిక్కుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా రాజధాని అమరావతి చెందిన రైతులు ఆయనపై గుర్రుగా ఉన్నారు. తమ ప్రాంతానికి చెందిన ఎంపీ తమకు మద్ధతు తెలపడం లేదని ఆగ్రహంగా ఉన్నారు. అటు సురేష్‌కు సొంత పార్టీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవితో కూడా విభేదాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అలాగే ఇటీవల ఆయన కారు ఆపి అమరావతి జే‌ఏ‌సి నేతలు, అమరావతికి మద్ధతు తెలపాలని గులాబీ పువ్వులు ఇవ్వగా, ఆయన వారిపై ఎస్సీ,ఎస్టీ కేసులు పెట్టించారు.

 

అయితే ఇలా వివాదాల్లో ఉంటున్న సురేష్‌కు దళిత సంఘాలు షాక్ ఇచ్చాయి. ఆయన ఎప్పుడో క్రైస్తవ మతం స్వీకరించారని, అలాంటప్పుడు ఎస్సీ రిజర్వడ్ అయిన బాపట్ల పార్లమెంట్‌లో ఎలా పోటీ చేస్తారని నియోజకవర్గంలోని దళితులు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణలు కాస్త  ముంబైకి చెందిన ‘దళిత్ పాజిటివ్ మూవ్మెంట్’‌కు చేరాయి.

 

ఇక వారు సురేష్ క్రైస్తవుడిగా మారి కూడా ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచిన విషయాన్ని రాష్ట్రపతి కోవింద్‌కు ఫిర్యాదు చేశారు. సురేష్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఓ దళిత వ్యక్తి క్రైస్తవం లేదా ఇస్లాం స్వీకరిస్తే, వారికి ఎస్సీ హోదా ఉండదు. మరి చూడాలి దీని బట్టి సురేష్‌ ఎంపీ పదవికి ఏమైనా ముప్పు వస్తుందేమో.  

మరింత సమాచారం తెలుసుకోండి: