రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సమరం మొదలు కావడంతో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు గెలుపుపై వ్యూహ, ప్రతివ్యూహాలతో సిద్ధమయ్యారు. ఏకపక్షంగా గెలిచేయాలని వైసీపీ చూస్తుంటే, అధికార వైసీపీకి గట్టి పోటీ ఇచ్చి సత్తా చూపించాలని టీడీపీ చూస్తోంది. అయితే రాష్ట్రం మొత్తంలో టీడీపీ.. వైసీపీకి కొన్ని జిల్లాల్లో గట్టి పోటీ ఇస్తుంది. అలా గట్టి పోటీనిచ్చే జిల్లాల్లో కృష్ణా జిల్లా కూడా ముందువరుసలో ఉంది. ఈ జిల్లాలో వైసీపీతో పాటు టీడీపీ కూడా స్ట్రాంగ్‌గా ఉంది.

 

మొన్న సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 16 సీట్లలో వైసీపీ 14 సీట్లు గెలవగా, టీడీపీ 2 చోట్ల గెలిచింది. ఇక గెలిచిన ఇద్దరిలో ఒకరైన వల్లభనేని వంశీ వైసీపీకి మద్ధతిస్తున్నారు. అయితే టీడీపీకి ఎమ్మెల్యేలు బలం లేకపోయిన, కేడర్ బలం బాగా ఉంది. దాంతోనే స్థానిక సమరంలో వైసీపీకి చెక్ పెట్టేందుకు చూస్తోంది. ఈ క్రమంలోనే మొన్న ఎన్నికల్లో వైసీపీ ఖాతాలో పడిన నందిగామ, జగ్గయ్యపేటల్లో టీడీపీ పుంజుకున్నట్లు తెలుస్తోంది.

 

ఆ రెండు నియోజకవర్గాల్లో ఫ్యాన్ స్పీడ్‌ని తెలుగు తమ్ముళ్ళు అడ్డుకోగలమనే ధీమాలో ఉన్నారు. ఎందుకంటే ఈ రెండు నియోజకవర్గాలపై అమరావతి ప్రభావం ఎక్కువగా ఉంది. ఇక్కడ ప్రజలు ఎక్కువ శాతం మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఉన్నారు. పైగా ఇక్కడున్న వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు కూడా అంత గొప్పగా లేదని తెలుస్తోంది. అటు నందిగామలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేటలో మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్యలు బాగా కష్టపడుతున్నారు.

 

ఓడిపోయిన దగ్గర నుంచి నియోజకవర్గంలో సమస్యలపై పోరాడుతున్నారు. ఇటీవల అయితే ప్రజా చైతన్య యాత్ర పేరుతో ప్రజల వద్దకు వెళుతున్నారు. వీరు వెనుక కేడర్ కూడా బాగానే కష్టపడుతుంది. ఈ క్రమంలోనే స్థానిక ఎన్నికల్లో నందిగామ, జగ్గయ్యపేటల్లో వైసీపీకి ధీటుగానే టీడీపీ ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి స్థానాల్లో గెలుచుకోవచ్చని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: