రాజ్యసభ స్థానం గ్యారంటీ అనుకున్న బీద మస్తాన్ రావు కు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత , ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొండి చెయ్యి చూపించారు .  ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం రాజ్యసభ సీటు ఆఫర్ తోనే రాజ్యసభ సభ్యుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ప్రమేయం తో మస్తాన్ రావు, జగన్మోహన్ రెడ్డి సమక్షం లో  వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు . తెలుగుదేశం పార్టీ లో సుదీర్ఘ కాలం కొనసాగిన బీద మస్తాన్ రావు , పార్టీ కోసం బాగానే చేతి చమురు వదిలించుకున్నారన్న వాదనలు లేకపోలేదు .

 

అయినా ఆయనకు మాత్రం టీడీపీ నాయకత్వం రాజకీయంగా సరైన అవకాశాన్ని కల్పించలేదన్న ఆరోపణలున్నాయి .  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ని కలిసి గతం లో మస్తాన్ రావు తనకు రాజ్యసభ  అవకాశం కల్పించాలని కోరినట్లు తెలుస్తోంది . అయితే చంద్రబాబు మాత్రం ఆయనకు రాజ్యసభ కు వెళ్లే  అవకాశం కల్పించకపోవడం తో తీవ్ర అసంతృప్తితో ఉన్న మస్తాన్ రావు , విజయసాయి ప్రమేయం తో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరారన్న ఊహాగానాలు విన్పించాయి  . అయితే పార్టీలో చేరే సమయం లో ఆయనకు రాజ్యసభ పదవి ఇస్తారన్న ప్రచారం జరిగింది . నిన్న , మొన్నటి వరకు రాజ్యసభ రేసులో ముందు వరుసలో ఉన్న మస్తాన్ రావు , మండలి ని రద్దు చేయాలని జగన్ నిర్ణయించడంతో ఒక్కసారిగా ఆయన ఆశలపై నీళ్లు చల్లినట్లయింది .

 

మండలి రద్దు తో మంత్రులు మోపిదేవి , పిల్లి సుభాష్ చంద్ర బోస్ కు రాజ్యసభ అవకాశం కల్పించాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొనడం , ఇక పారిశ్రామికవేత్త అయోధ్య రామిరెడ్డికి  జగన్ ముందే మాట ఇచ్చి ఉండడం , చివరి నిమిషం లో ముకేశ్ అంబానీ రంగం లోకి దిగి తన సన్నిహితుడు నత్వాని కి అవకాశం కల్పించాలని కోరడం వంటి పరిణామాలు మస్తాన్ రావు  కు రాజ్యసభ అవకాశాన్ని దూరం చేశాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: