టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆస్తులు వేలం వేయడానికి ఇండియన్ బ్యాంక్ సిద్ధమైంది. బ్యాంక్ గంటా ఆస్తులను వేలం వేయనున్నట్లు ప్రకటన చేసింది. ఈ నెల 16వ తేదీన గంటా ఆస్తులకు బ్యాంక్ ఈ వేలం నిర్వహించనుంది. మార్చి 15వ తేదీ వరకు ఆన్ లైన్ లో ఈ వేలంలో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్ బ్యాంక్ ఒక ప్రకటనలో వేలంలో పాల్గొనటానికి ఆసక్తి ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. 
 
ఇండియన్ బ్యాంక్ లో కొన్నేళ్ల క్రితం గంటా శ్రీనివాసరావుకు చెందిన ప్రత్యూష కంపెనీ 141 కోట్ల రూపాయల రుణం తీసుకుంది. రుణం తీసుకున్న సమయంలో గంటా ఆ కంపెనీకి డైరెక్టర్ గా ఉన్నారు. సకాలంలో రుణం చెల్లించకపోవడంతో బ్యాంకు ఆస్తులను వేలం వేయాలని గంటా ఆస్తులను స్వాధీనం చేసుకుంది. కంపెనీ తీసుకున్న రుణం వడ్డీలతో కలిపి 221 కోట్ల రూపాయలకు చేరింది. 
 
ఇండియన్ బ్యాంక్ గంటాతో పాటు ప్రత్యూష కంపెనీకి డైరెక్టర్లుగా ఉన్న మరో ఏడుగురి ఆస్తులను వేలం వేయనుంది. గతంలో గంటా ప్రభుత్వ భూములను తనఖా పెట్టి లోన్ తీసుకున్నాడని వార్తలు వినిపించాయి. ఇండియన్ బ్యాంక్ మాత్రం ఆ ఆరోపణలు ఈ రుణానికి సంబంధించినవి కాదని చెబుతోంది. బ్యాంక్ విశాఖ నార్త్ డివిజన్ లో ఉన్న ఫ్లాట్ ను వేలం వేయనున్నట్లు తెలుస్తోంది. ఈ వేలం పాటకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. 
 
గంటా శ్రీనివాసరావు ఆస్తుల వేలానికి సంబంధించిన వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఆయనపై ఇదే తరహా ఆరోపణలు వచ్చాయి. అప్పుడు ఆయన స్పందించి ఈ వార్తల గురించి స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వ భూములను తనఖా పెట్టి రుణాలు తీసుకున్నారన్న ఆరోపణల గురించి కూడా స్పందించి స్పష్టత ఇచ్చారు. తాజాగా మరోసారి ఆస్తుల వేలం గురించి వార్తలు వస్తూ ఉండటంపై గంటా శ్రీనివాసరావు ఏమని స్పందిస్తారో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: