గుంటూరు జిల్లా మాచర్లలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా మహేశ్వరరావులపై దాడులు జరిపారు. టీడీపీ నేతల కార్లను అడ్డగించి వాటిపై వైసీపీ వర్గీయులు దాడి చేసి ధ్వంసం చేశారు. టీడీపీ నేతలు కార్యకర్తలను కలిసేందుకు వెళ్లిన సమయంలో ఈ దాడి జరిగింది. ఈ ఘటనతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. కార్యకర్తలు కర్రలతో దాడి చేయడంతో కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. 
 
బోండా ఉమ ఈ ఘటనపై స్పందిస్తూ వైసీపీ వర్గీయులే తమ వెంట పడ్డారని చెప్పారు. నిన్న మాచర్లలో వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నట్లు వార్తలు వచ్చాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో బోండా ఉమ, బుద్దా వెంకన్న మాచర్లకు బయలుదేరగా వైసీపీ వర్గీయులు వీరిపై దాడి చేశారు. ఈ దాడిలో కొందరికి గాయాలు అయ్యాయని సమాచారం. 
 
బోండా ఉమ కార్యకర్తలు దాడి చేస్తుంటే ప్రాణ భయంతో వెళుతుండగా డీఎస్పీ హరిబాబు తమకు రక్షణ కల్పించారని చెప్పారు. వైసీపీ వర్గీయులు డీఎస్పీపై కూడా దాడులు చేశారని ఆరోపణలు చేశారు. వైసీపీ కార్యకర్తలు తమ వాహనాలతో పాటు డీఎస్పీ వాహనంపై కూడా దాడులు చేశారని అన్నారు. పోలీసుల సహాయంతో తాము క్షేమంగా బయటపడ్డామని చెప్పారు. 
 
దాడి అనంతరం ఫిర్యాదు చేయటానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లామని అక్కడ ఎవరూ లేరని చెప్పారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైసీపీ, టీడీపీ నేతలు దాడులు చేసుకుంటున్నారు. నామినేషన్లు వేయడానికి వెళ్లే సమయంలో అడ్డుకుంటున్నారని ఒక పార్టీ నేతలపై మరో పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కడప జిల్లాలో వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిపై నిన్న టీడీపీ నేతలు దాడి చేశారు.                       

మరింత సమాచారం తెలుసుకోండి: