దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతోంది. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతూ ఉండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కరోనా దేశంలోని అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా విమాన ప్రయాణాల ద్వారా ఈ వైరస్ వేగంగా విజృంభిస్తోంది. 
 
విదేశీ పర్యాటక రాకపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే చాలా దేశాలు వీసాలను నిలిపివేయడంతో పాటు విమాన ప్రయాణాలను నిషేధించాయి. విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య భారీగా తగ్గడంతో విమానయాన సంస్థలు ప్రయాణికుల కోసం పలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. విమాన చార్జీలు 40 నుండి 70 శాతం వరకు తగ్గినట్లు తెలుస్తోంది. ప్రముఖ ట్రావెల్ ప్లానింగ్ వెబ్ సైట్ యాత్రా.కామ్ సగటున 40 శాతం విమాన చార్జీలు తగ్గినట్లు తెలిపింది. 
 
ఇతర మార్గాలతో పోలిస్తే ఢిల్లీ ముంబై మార్గంలో విమాన చార్జీలు మరింతగా తగ్గాయి. చార్జీలు దాదాపు 70 శాతం తగ్గినట్లు తెలుస్తోంది. బెంగళూరు - ముంబై రూట్లలో 45 శాతానికి పైగా చార్జీలు తగ్గినట్లు సమాచారం. అన్ని మార్గంలో విమాన చార్జీలు తగ్గుతుంటే ఢిల్లీ - గోవా మార్గంలో మాత్రం చార్జీలు పెరిగాయి. దాదాపు 8 శాతం చార్జీలు పెరిగినట్లు సమాచారం. గోవాలో ఇప్పటివరకూ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడంతో ప్రయాణికులు గోవా పర్యటన పట్ల ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. 
 
యాత్రా.కామ్ చాలా మంది ప్రయాణికులు విదేశీ ప్రయాణాలను క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు తెలిపింది. యాత్రా.కామ్ సీవోవో మాట్లాడుతూ తాము వినియోగదారులను ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, ప్రత్యామ్నాయ తేదీలకు టికెట్లను బుక్ చేసుకోవాలని సూచనలు ఇస్తున్నామని తెలిపారు. భారత్ లో ఇప్పటివరకూ 73 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రధాని మోదీ విదేశీ ప్రయాణాలను విరమించుకోవాలని కేంద్ర మంత్రులకు సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: