ఏపీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కరోనా ఎఫెక్ట్ తో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆరు వారాల పాటు ఎన్నికల ప్రక్రియను నిలిపివేసి ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించి షెడ్యూల్ విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ఏకగ్రీవమైన స్థానాల్లో ఎన్నికలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. ఈసీ ప్రకటనపై సీఎం జగన్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. 
 
ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేయడం సరికాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం గురించి చర్చించడానికి సీఎం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు. ఎన్నికలు వాయిదా పడితే 14వ ఆర్థిక సంఘం నుంచి నిధులు రావని యధావిధిగా ఎన్నికలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని గవర్నర్ ను జగన్ కోరినట్లు సమాచారం. 
 
ఈరోజు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో, ప్రభుత్వ ఉన్నతాధికారులతో కరోనా గురించి సమీక్ష నిర్వహించిన జగన్ సమావేశం అనంతరం నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలిశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంపై జగన్ తీవ్ర అసహనానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి మాట మాత్రమైనా చెప్పకుండా ఆరు వారాల పాటు ఎన్నికలు వాయిదా వేయడం ఏంటని జగన్ గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. 
 
ఎన్నికల కమిషన్ గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు బదిలీ చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. ఎటువంటి విచారణ లేకుండా అధికారులను బదిలీ చేయడం మంచి నిర్ణయం అనిపించుకోదని... జరుగుతున్న ఘటనలపై గవర్నర్ కు జగన్ నిశితంగా వివరించనున్నారని తెలుస్తోంది. కేంద్రం కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించడంతో ఈసీ ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. 
 
అత్యున్నత స్థాయి సమావేశం తరువాతే ఎన్నికలను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నామని ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. ఎన్నిక ప్రక్రియ యధావిథిగా ఉంటుందని, ఎన్నికలు మాత్రమే వాయిదా వేస్తున్నామని తెలిపారు. ఎంపీటీసీ, జడ్పీటీసీలుగా ఎన్నికైన వారు అలాగే కొనసాగుతారని ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియ నిలిపివేత మాత్రమేనని రద్దు కాదని ఈసీ నుండి ప్రకటన వెలువడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: