బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడిగా క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఒక సామాన్య కార్య‌క‌ర్త‌కు ద‌క్కిన అపూర్వ గౌర‌వంగా ఆయ‌న చెప్పుకున్నారు. అయితే, ఇక నుంచి పార్టీ న‌డ‌వ‌డికి ఎలా ఉండ‌బోతోంది..?  గులాబీ ద‌ళ‌ప‌తి, సీఎం కేసీఆర్‌ను త‌ట్టుకుని నిల‌బ‌డే స‌త్తా బండిలో ఉందా..?  కాషాయ ద‌ళాన్ని ముందుకు న‌డిపించే ద‌మ్ముధైర్యం ఉందా..?  పార్టీలోని హేమాహేమీల‌ను స‌మ‌న్వ‌య‌ప‌ర్చుకుంటూ వ్యూహాల‌ను అమ‌లుప‌ర్చ‌గ‌ల నేర్పు, ఓర్పు ఆయ‌న‌లో ఉన్నాయా..? ఇప్పుడు ఇదే ముచ్చ‌ట‌ అన్నిరాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారుతోంది. నిజానికి.. బీజేపీలో సామాన్య కార్య‌క‌ర్త‌గా కొన‌సాగుతూ అసామాన్య విజ‌యాల‌ను బండి సంజ‌య్‌ అందుకున్నారు. ప‌లుమార్లు ఓట‌ములు ఎదురైనా బెదిరిపోకుండా ధైర్యంగా ముందుకు వెళ్లారు. ఈ క్ర‌మంలో  పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో అధికార టీఆర్ఎస్‌ అభ్య‌ర్థి, సిట్టింగ్ ఎంపీ గా ఉన్న వినోద్‌కుమార్‌ను సంజ‌య్ ఓడించి, రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం సృష్టించారు. ఆనాడు క‌రీంన‌గ‌ర్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో టీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ హిందువుల‌ను ఉద్దేశించి వివాదాస్ప‌దంగా, చేసిన కామెంట్స్‌ను త‌న‌కు అనుకూలంగా మ‌ల‌చుకోవ‌డం బండి సంజ‌య్ స‌క్సెస్ అయ్యారు. ఇక అప్ప‌టి నుంచి ఆయ‌న పేరు రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగింది.  

ఇక పార్టీ రాష్ట్ర అధ్య‌క్ష‌ప‌ద‌వికి డీకే అరుణ‌, జితేంద‌ర్‌రెడ్డి, నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌తోపాటు ప‌లువురు నాయ‌కులు పోటీప‌డినా అనూహ్యంగా బండి సంజ‌య్‌కే ద‌క్కింది. అయితే.. ఇప్ప‌టివ‌ర‌కు ఒక ఎత్తు అయితే.. ఇక నుంచి మ‌రోఎత్తు.. అధికార టీఆర్ఎస్ పార్టీని త‌ట్టుకుని నిల‌బ‌డుతూ, సీఎం కేసీఆర్ వ్యూహాల‌ను ప‌సిగ‌డుతూ పార్టీని ముందుకు న‌డిపించ‌డం అంత సుల‌భ‌మేమీకాదు. ఇక రాష్ట్రపార్టీ అధ్యక్షుడిగా నియమితుడయ్యాక.. ఆదివారం తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చిన సంజయ్‌కి పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. నాంపల్లిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన అభినందన సభలో సంజయ్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో మండిప‌డ్డారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై బీజేపీ యుద్ధం ఆరంభమైందని ప్రకటించారు. టీఆర్‌ఎస్‌, ఎంఐఎంల విధ్వంసకాండను అడ్డుకునేందుకు, తెలంగాణ అభివృద్ధి కోసం ఉద్యమం చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ నిధులను గల్లీ గల్లీకి తీసుకెళ్లేందుకు ప్రతి గ్రామానికి, మండలానికి, జిల్లాకు వెళ్తామని, పాదయాత్రలు, రథయాత్రలు చేస్తామని అన్నారు. టీఆర్‌ఎ్‌సకు కౌంట్‌డౌన్‌ ఆరంభమైందన్నారు.

ఇదే స‌మ‌యంలో కార్య‌క‌ర్త‌ల్లో ధైర్యం నూరిపోసేందుకు ప్ర‌య‌త్నం చేశారు. ‘ఖబడ్దార్‌ కేసీఆర్‌.. నా తమ్ముళ్లపై, నా కార్యకర్తలపె ఒక్క లాఠీ దెబ్బపడినా నీ గుండెల్లో నిద్రపోతా. బీజేపీ కార్యకర్తలు దేనికీ భయపడరు. బండి సంజయ్‌ దేనికీ భయపడడు. ప్రజల కోసం పనిచేస్తాం. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం’ అని ప్రకటించారు. ఇక ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంది కానీ.. అస‌లు స‌మ‌స్య ఏమిటంటే.. పార్టీలోని ప‌లువురు సీనియ‌ర్లు బండిని ముందుకు పోనిస్తారా..? స‌హ‌క‌రిస్తారా..? అన్న‌దానిపైనే పార్టీ బ‌లోపేతం కావ‌డం ఆధార‌ప‌డి ఉంటుంద‌ని ప‌లువురు నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు.  కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, సత్యకుమార్‌, ఎంపీ అరవింద్‌, ఇంద్రసేనారెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, డీకే అరుణ, వివేక్‌, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డిలు బండికి ఏమేర‌కు స‌హ‌క‌రిస్తారో చూడాలి మ‌రి. పార్టీ కోసం ఎక్క‌డిదాకైనా వెళ్లే ద‌మ్మూధైర్యం బండి సంజ‌య్‌కు ఉంద‌ని, కానీ.. పార్టీలోని ప‌లువురు నేత‌లు ముందుకు న‌డ‌వ‌నిస్తారా..? అని అనుచ‌రులు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: