ప్రపంచవ్యాప్తంగా ప్రజలను కరోనా వైరస్ భయభ్రాంతులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 2,00,000 మంది కరోనా వైరస్ భారీన పడగా వీరిలో 7,965 మంది మృతి చెందారు. మన దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 137కు చేరింది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ఇటలీ ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. 80 ఏళ్లు పైబడిన వారికి చికిత్స అందించలేమని ఇటలీ స్పష్టం చేసింది. 
 
ఇటలీలో అత్యంత భయానక పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే ఈ దేశంలో 27,980 మందికి కరోనా సోకింది. వీరిలో 2,158 మంది చనిపోయారు. దేశంలో ఇంటెన్సివ్ కేర్ బెడ్ యూనిట్లు 6,000 కాగా కేసుల సంఖ్య నాలుగు రెట్లు ఉంది. తగినన్ని వెంటలేటర్లు లేకపోవడంతో డాక్టర్లు నిస్సహాయులైపోతున్నారు. అందువల్ల ఇటలీ ప్రభుత్వం 80 ఏళ్లు పైబడిన వారిని పక్కనబెట్టి మిగతావారిని అడ్మిట్ చేసుకుంటోంది. 
 
ఖచ్చితంగా కరోనా భారీన పడినా కోలుకుంటారనుకునేవారికే ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తోంది. మిగిలిన వారికి ప్రైవేట్ ఆస్పత్రులలో, నర్సింగ్ హోంలలో చికిత్స అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటాలియన్‌ కాలేజ్‌ ఆఫ్‌ అనస్తీషియా, రిససియేషన్‌ అండ్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ విడుదల చేసిన కొన్ని మార్గదర్శకాలను ప్రభుత్వం పాటిస్తోంది. సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించడాన్ని దేశంలో ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. 
 
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మృతదేహాలను శవపేటికల్లో భద్రపరిచి ఎక్కడికీ తీసుకెళ్లలేక ఇటలీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే లంబార్డీ రాష్ట్రంలో మృతుల సంఖ్య ఎక్కువగా ఉందని సమాచారం. మరోవైపు మన దేశంలో కరోనా భారీన పడి ముగ్గురు చనిపోయారు. తెలంగాణలో ఇప్పటివరకూ ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఏపీలో ఒక వ్యక్తికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. తెలుగు రాష్ట్రాలు కరోనా వ్యాపించకుండా చర్యలు చేపట్టటంతో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: