భారత్ లో కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 150కు చేరగా విదేశాల్లో ఉన్న 276 మంది భారతీయులకు కరోనా సోకినట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటన చేసింది. వీరిలో 255 మంది ఇరాన్ లో ఉన్నట్లు విదేశంగ శాఖ చెబుతోంది. రోజురోజుకు దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 
 
ఇప్పటికే కరోనాను కట్టడి చేయడానికి పలు నిర్ణయాలు తీసుకున్న మోదీ తాజాగా విదేశాల్లో ఉన్న భారతీయులపై నిషేధం విధించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రవాస భారతీయులు దేశంలో అడుగు పెట్టకూడదని ఆదేశాలు జారీ చేశారు. పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ మార్చి 31 వరకు ఈ నిషేధం అమలులో ఉండనుందని చెబుతున్నారు. 
 
దేశంలో ఇప్పటివరకూ నమోదైన కేసుల్లో 14 మంది కరోనా నుండి కోలుకోగా ముగ్గురు మృతి చెందారు. కేంద్ర ప్రభుత్వం విదేశీయులతో పాటు ప్రవాస భారతీయులపై నిషేధం విధించడం గమనార్హం. అత్యవసరం ఉన్నవారికి మాత్రమే కేంద్రం దేశంలోకి అనుమతించనుందని తెలుస్తోంది. వారికి కరోనా పరీక్షలను నిర్వహించి రిపోర్టులలో నెగిటివ్ అని తేలితే మాత్రమే దేశంలోకి అనుమతిస్తారు. 
 
గల్ఫ్ దేశాల నుంచి మన దేశానికి ఎవరైనా వస్తే వారికి క్వారంటైన్ తప్పనిసరి అని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఏపీలో మాత్రం ఒక్క కేసు నమోదైంది. కరోనా వ్యాప్తి దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు అమలు చేస్తోంది. ప్రభుత్వం సచివాలయంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సందర్శకుల రాకను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. అత్యవసర పరిస్థితులు ఉంటే మాత్రమే సచివాలయానికి, ప్రభుత్వ కార్యాలయాలకు సందర్శకులను అనుమతించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో స్కూళ్లను, థియేటర్లను బంద్ చేసిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: