ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న‌ కరోనా వైరస్‌(కోవిద్‌-19) రోజురోజుకూ మ‌రింత‌గా వ్యాప్తి చెందుతోంది. ఇక రూర‌ల్ ఏరియాల్లో కూడా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి.  జ‌న‌జీవ‌నం స్తంభించిపోతోంది. ఇంటి నుంచి బ‌య‌ట అడుగుపెట్టాలంటేనే ప్ర‌జ‌లు వ‌ణికిపోతున్నారు. ఈ నేప‌థ్యంలో క‌రోనా  ప్రభావం రైల్వేశాఖ మీద కూడా పడింది. దేశంలో ప్ర‌జార‌వాణ‌లో రైల్వేశాఖ అత్యంత కీల‌క‌పాత్ర పోషిస్తోంది. దేశంలో నిత్యం లక్షలాది మంది రైళ్లలో ప్ర‌యాణిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో రైల్వే శాఖ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. దీంతో, వైరస్‌ వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యగా రైల్వేశాఖ అధికారులు ఏకంగా 168 రైళ్లను రద్దు చేశారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా మార్చి 20 నుంచి 31 వరకు రైళ్లు రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ముందస్తుగా టికెట్‌ బుక్‌ చేసుకున్న ప్రయాణికులకు వ్యక్తిగతంగా సమాచారం అందిస్తామని ఈ సంద‌ర్భంగా రైల్వేశాఖ ప్రకటించింది.  రైల్వేశాఖ నిర్ణ‌యంతో ప‌రిస్థితి ఎంత సీరియ‌స్‌గా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. 

 

ఇప్ప‌టికే ప్లాట్‌ఫాం టికెట్ల ధ‌ర‌ను కూడా విప‌రీతంగా పెంచారు. ఏకంగా రూ.50రూపాయ‌లుగా నిర్ణ‌యించారు. ఇదిలా ఉండ‌గా,  భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 169కి చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మృతుల సంఖ్య మూడుకు చేరుకుంది. అన్ని రాష్ట్రాలు అప్ర‌మ‌త్తం అవుతున్నాయి. నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌తో క‌రోనా క‌ట్ట‌డికి చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతుండ‌డంతో ప్ర‌జ‌ల్లో తీవ్ర ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇందులో తెలంగాణ‌లో కాస్త ఎక్కువ‌గానే ప్ర‌భావం ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు 13కేసులు న‌మోదు అయ్యాయి. ముఖ్యంగా క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ప‌ర్య‌టించిన ఇండోనేషియా దేశ‌స్తుల్లో ఏకంగా ఏడుగురికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో స్థానికంగానేకాదు రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం రేగుతోంది. ఈ నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. మ‌రోవైపు దేశంలో కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: