ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలు ఈ నెల 31 వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించడం  ద్వారా కరోనా కట్టడికి ముందడుగు వేశాయి . అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నమోదైన కేసుల సంఖ్య పరిశీలిస్తే , రెండు రాష్ట్రాలను లాక్ డౌన్ చేసేంత విపత్తు ఏమి కన్పించలేదన్న వాదనలు విన్పిస్తున్నాయి . అయితే కరోనా మహమ్మారి వికట్టహాసం చేయకముందే కట్టడియే మేలని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భావించి,  లాక్ డౌన్ నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి .

 

మార్చి మొదటి వారం లో కరోనా మహమ్మారి ని ఇద్దరు ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డి లు చాల తేలికగా తీసుకున్న విషయం తెల్సిందే . కరోనా కట్టడికి ఒక పారా సెట్ మాల్ టాబ్లెట్ వేసుకుంటే చాలన్న ఇరువురు , అంతలోనే ఈ వైరస్ విదేశాల్లో ఎంతమందిని పొట్టన పెట్టుకుంటుందో తెలుసుకుని అప్రమత్తం కావడం అభినందించదగ్గ విషయమే . ఒక్కసారి కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి చెందడమంటూ మొదలుపెడితే , దానివేగం ఎంతగా ఉంటుందో అంచనా వేయడానికి మన దేశం లో నమోదవుతున్న కేసులను పరిశీలిస్తే చాలు ... ఇట్టే అర్ధమవుతుంది .

 

తొలి వంద కేసులు నమోదవడానికి పట్టిన సమయం కంటే ఆ తరువాత వంద కేసులు నమోదవడానికి పట్టిన సమయం తక్కువైతే , ఇక తరువాతి వంద కేసులైతే రెండు రోజుల వ్యవధిలోనే నమోదయ్యాయంటే , వైరస్ విస్తృతి ఎంత వేగంగా ఉందో స్పష్టమవుతోంది . ఈ నేపధ్యం లో కేసులు తక్కువగా నమోదయ్యాయి కదా... అని వేచి చూడకుండా , రెండు తెలుగు రాష్ట్రాలను లాక్ డౌన్ చేస్తూ .. ఇరువురు ముఖ్యమంత్రులు సముచిత నిర్ణయాన్ని తీసుకున్నారన్న వాదనలు విన్పిస్తున్నాయి . అదే సమయం లో పేద ప్రజల గురించి ఆలోచించి ఉచిత రేషన్ , ఆర్ధిక సహాయం చేయాలన్న సముచిత నిర్ణయం ద్వారా ప్రజల మనస్సులను గెల్చుకునే ప్రయత్నం చేశారు .

మరింత సమాచారం తెలుసుకోండి: