తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ అదిరిపోయే శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో ఏప్రిల్ 7 తర్వాత కరోనా బాధితులే ఉండరని ప్రకటన చేశారు. ఏప్రిల్ రెండో వారం నుంచి రాష్ట్రంలో కేసులు నమోదయ్యే అవకాశం లేదని... ప్రజలు లాక్ డౌన్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సీఎం సూచించారు. ప్రజలు ఇదే విధంగా సహాయ సహకారాలు అందించాలని... సామాజిక దూరం పాటించి లాక్ డౌన్ ను విజయవంతం చేయాలని కోరారు. 
 
5,742 బృందాలు రాష్ట్రంలో క్వారంటైన్ లో ఉన్నవారిని పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో చికిత్స పొందుతున్న వారందరూ బాగానే ఉన్నారని... త్వరలోనే వారందరూ కోలుకుని డిశ్చార్జ్ అవుతారని అన్నారు. కరోనా బాధితుల్లో 11 మందికి కరోనా నెగిటివ్ అని తేలిందని రేపు వారిని డిశ్చార్జ్ చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో వైద్యుల పర్యవేక్షణలో 25,935 మంది ఉన్నారని... వారిలో ఎవరికీ కరోనా లక్షణాలు లేవని అన్నారు. 
 
రాష్ట్రానికి కొత్త కేసులు వచ్చే అవకాశం లేదని అన్నారు. భారత్ లో కరోనా వ్యాప్తి నివారణకు ఏకైక ఆయుధం లాక్ డౌన్ అని అన్నారు. భారత్ కరోనాను అడ్డుకునే విషయంలో చాలా తెలివిగా వ్యవహరించిందని తెలిపారు. కరోనా నివారణకు భారత్ తీసుకున్న చర్యల విషయంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు వచ్చాయని అన్నారు. 
 
ప్రజలందరూ మరికొన్ని రోజులు స్వీయ నియంత్రణ పాటిస్తే కరోనా గండం నుంచి బయటపడతామని తెలిపారు. రాష్ట్రంలో తొలి కరోనా బాధితుడు ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యాడని సీఎం గుర్తు చేశారు. ప్రధాని మోదీతోను ఈ విషయం గురించి తాను మాట్లాడానని తెలిపారు. కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ రాష్ట్రంలో మంచి ఫలితాలను ఇస్తోందని అన్నారు. సీఎం కేసీఆర్ ఈ సమావేశంలో రైతుల సమస్యలు, ధాన్యం కొనుగోలు, ఇతర విషయాల గురించి మాట్లాడారు. ప్రధాని మోదీ లాక్ డౌన్ నిర్ణయం, సీఎం కేసీఆర్ లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయడం సత్ఫలితాలు ఇచ్చిందని చెప్పవచ్చు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: