సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఏప్రిల్ 15న లాక్ డౌన్ ఎత్తేసే అవకాశం లేదని ప్రకటన చేశారు. రాష్ట్రం, దేశం స్థిమితపడిన తర్వాతే లాక్ డౌన్ ఎత్తేస్తామని అన్నారు. మన వైద్య నిపుణులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారని అన్నారు. త్వరగా ఈ విపత్కర పరిస్థితి నుంచి బయటపడాలని అందరికన్నా ఎక్కువగా తాను దేవుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. 
 
రాష్ట్రానికి 12,000 కోట్ల రూపాయల ఆదాయం రావాల్సి ఉందని కానీ లాక్ డౌన్ తో అంతా సున్నాలా ఉందని అన్నారు. అవసరమైతే ఎమ్మెల్యేలకు కూడా జీతాలు బంద్ చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు కూడా కోత విధించే అవకాశం ఉందని ప్రకటన చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు భాగం కాదా...? అని ప్రశ్నించారు. కష్టం వస్తే అందరూ పంచుకోవాలని... ఇది లగ్జరీ సమయం కాదని పేర్కొన్నారు. 
 
ప్రతి ఒక్కరూ రెండు నెలలో, మూడు నెలలో కొంచెం నియంత్రణ పాటించాలని సూచించారు. విరాళాల కోసం పిలుపు ఇవ్వాల్సిన అవసరం లేదని... గొప్పవాళ్లు విరాళాలు ఇస్తున్నారని అన్నారు. కరోనా గురించి దుర్మార్గమైన ప్రచారాలు చేసే వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 70 కరోనా కేసులు నమోదయ్యాయని... ఒక వ్యక్తి మొదట్లోనే డిశ్చార్జ్ అయ్యాడని తెలిపారు. 
 
రాష్ట్రంలో చికిత్స పొందుతున్న రోగుల్లో ఆదివారం 11 మందికి నెగిటివ్ రావడం మంచి వార్త అని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 58 మందికి చికిత్స జరుగుతోందని... 76 ఏళ్ల ఒక రోగి పరిస్థితి మాత్రం కొంత ఆందోళనకరంగా ఉందని అన్నారు. ఏప్రిల్ 7కు క్వారంటైన్ లో ఉండే వారి సంఖ్య సున్నాగా ఉంటుందని తెలిపారు. భారత్ లాక్ డౌన్ చేయడమనే ఆయుధాన్ని కరెక్ట్ గా ప్రయోగించిందని చెప్పారు. ప్రజల నుంచి సహకారం లభిస్తే తక్కువ నష్టంతో బయటపడవచ్చని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: