ఏపీ సీఎం జగన్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ ను తొలగించిన సంగతి తెలిసిందే. అంతే కాదు.. మళ్లీ 24 గంటల్లోనే కొత్త కమిషనర్‌ ను నియమించారు. ఏపీ రాష్ట్రఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కనగరాజు నియమితులయ్యారు. ఆయన విజయవాడలో బాధ్యతలు కూడా స్వీకరించేశారు. ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని మూడేళ్లకు కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, దానికి అనుగుణంగా రమేష్ కుమార్ పదవికాలం పూర్తి అయిందని ప్రభుత్వం ప్రకటించడం చకచకా జరిగిపోయిన సంగతి తెలిసిందే.

 

 

ఇప్పుడు కొత్త కమిషనర్‌ కనగరాజు మూడేళ్లపాటు పదవిలో ఉంటారు. జస్టిస్ కనగరాజు నియామకానికి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర కూడా వేశారు. అయితే అసలు నిమ్మగడ్డను తీసేసిన తర్వాత జగన్ ఎందుకు రిటైర్డ్ న్యాయమూర్తి వైపు మొగ్గారు.. సహజంగా ఎన్నికల కమిషనర్‌లు గా రిటైర్‌ ఐఏఎస్‌లను నియమిస్తుంటారు. మరి జగన్ ఎందుకు రిటైర్డ్ న్యాయమూర్తి వైపు మొగ్గారు. ఇందుకు అనేక ఆసక్తికరమైన విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

 

 

అదేంటంటే.. రిటైర్డ్‌ ఐఏఎస్‌లు అప్పటికే అనేక మంది ప్రభుత్వ పెద్దల వద్ద పని చేసి ఉంటారు. వారితో కలసి మెలిసి పని చేయడం వల్ల చాలా సందర్భాల్లో వారి నిష్పాక్షికతపై అనుమానాలు వస్తున్నాయి. వారు తీసుకునే నిర్ణయాలపై గతం తాలూకు ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. మొన్నటికి మొన్న నిమ్మగడ్డ కూడా తన కూతురుకు చంద్రబాబు పదవి ఇవ్వడం వల్లే ఆయనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారని వైసీపీ ఆరోపించింది కూడా.

 

అదే హైకోర్టు రిటైర్డ్‌ జడ్జిలయితే ఇలాంటి సమస్య ఉండదని జగన్ భావించినట్టు తెలుస్తోంది. అయితే హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం దేశంలో ఇదే ప్రథమం అని చెబుతున్నారు. ఇందువల్ల ఎన్నికలు అత్యంత పారదర్శకంగా, నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: