ఏపీలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో ఈరోజు ఉదయం వరకు 405 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టినా రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కరోనాను నియంత్రించడంలో విఫలమవుతోంది. రాష్ట్రంలో ప్రతిరోజూ పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కర్నూలు, గుంటూరు జిల్లాలలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. 
 
రాష్ట్రంలో నిన్న 24 కేసులు నమోదు కాగా గుంటూరు జిల్లాలోనే 17 కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్ మర్కజ్ ప్రార్థనలకు హాజరైన వారే నిన్న ఎక్కువగా గుంటూరు జిల్లాలో కరోనా భారీన పడ్డారు. ఒకరికి మాత్రం విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వ్యక్తి ద్వారా కరోనా సోకినట్లు తేలింది. అయితే గుంటూరులోని పల్నాడులో కరోనా భారీన పడిన ఇద్దరు రెండు రోజుల వ్యవధిలో మృతి చెందడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. 
 
వీరికి, వీరి కుటుంబ సభ్యులకు మర్కజ్ ప్రార్థనలతో సంబంధం లేకపోవడం, ప్రయాణ చరిత్ర లేకపోవడంతో అధికారులు టెన్షన్ పడుతున్నారు. వీరి ద్వారా ఎవరెవరికి కరోనా సోకిందో అధికారులకు అంతుచిక్కటం లేదు. ఇదే విధంగా పొన్నూరులో మరో వ్యక్తికి కరోనా ఏ విధంగా సోకిందో అధికారులకు అర్థం కావడం లేదు. ఈ ముగ్గురి ద్వారా ఎవరెవరికి కరోనా సోకిందో గుర్తించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. 
 
నిన్నటివరకు గుంటూరు జిల్లాలో 75 కరోనా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ ప్రార్థనలతో సంబంధం లేని వారికి, విదేశీ ప్రయాణికులతో సంబంధం లేని వారికి కరోనా సోకుతూ ఉండటంతో అధికారులకు కొత్త కేసులు నమోదు కాకుండా నిబంధనలను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. మృతి చెందిన వారిలో ఒకరు కేబుల్ ఆపరేటర్ గా మరొకరు ఎలక్ట్రీషియన్ గా పని చేసేవారు. వీరి నుంచి ఆయా ప్రాంతాలలో కరోనా వ్యాప్తి చెంది ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.        

మరింత సమాచారం తెలుసుకోండి: