రాయలసీమలోని కర్నూలు జిల్లాపై కరోనా పంజా విసురుతోంది. జిల్లాలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు 84 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఉదయం వరకు 82 కేసులు నమోదు కాగా నిన్న మరో 2 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న కర్నూలు జిల్లాలో ఒక కేసు నమోదు కాగా చాగలమర్రిలో మరో కేసు నమోదైంది. జిల్లాలో కర్నూలు, నంద్యాలలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. 
 
రాష్ట్రంలో 84 కేసులతో కర్నూలు ప్రథమ స్థానంలో ఉండగా 82 కేసులతో గుంటూరు రెండో స్థానంలో ఉంది. జిల్లాలో పట్టణాలతో పాటు గ్రామాల్లో కూడా కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. జిల్లాలోని కరోనా బాధితుల్లో ఎక్కువ మంది యువకులే ఉండటం గమనార్హం. యువకుల్లో రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉండటం వల్ల వారు త్వరగానే కోలుకుంటారని వైద్యులు చెబుతున్నారు. జిల్లాలో కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో ఐదుగురు మహిళలు, ఒక బాలుడు ఉన్నారు. 
 
మహిళలకు పురుషుల ద్వారానే కరోనా సోకి ఉండవచ్చని వైద్యులు భావిస్తున్నారు. రోజురోజుకు కేసులు పెరుగుతుండటంతో అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను అధికారులు రెడ్ జోన్లుగా ప్రకటించి ఆ ప్రాంతాలలో అనుమానితులను గుర్తించే పనిలో పడ్డారు. జిల్లాలో పోలీసులు లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. కేసుల సంఖ్య పెరగడంతో కొత్త కేసులు నమోదు కాకుండా చర్యలు చేపడుతున్నారు. 
 
జిల్లాలో నమోదైన 84 కేసుల్లో ఒక కేసు మినహా మిగిలిన అన్ని కేసులకు ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు సంబంధం ఉండటం గమనార్హం. అధికారులు జిల్లాలో జనం బయటకు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 420కు చేరింది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 15 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న గుంటూరులో 7, నెల్లూరులో 4, కర్నూల్ లో 2, చిత్తూరులో ఒక కేసు కడపలో ఒక కేసు నమోదయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: