ఇండియాలో కరోనా మహమ్మారి కొన్ని రాష్ట్రాల్లో భయంకరమైన వేగంతో విస్తరిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో దీని వేగం ఓ మాదిరిగా ఉండగా.. మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో జట్ వేగంతో కరోనా విస్తరిస్తోంది. ఇక మహారాష్ట్రలో అయితే కరోనా వైరస్ సమస్య చాలా తీవ్రంగా కనిపిస్తోంది. 

 

 

రోజూ వందల సంఖ్యలో కరోనా వైరస్ కేసులు మహారాష్ట్రలో బయటపడుతున్నాయి. పొరుగున ఉన్న తెలంగాణ వంటి రాష్ట్రాలు కూడా మహారాష్ట్రను చూసి భయపడే స్థాయికి చేరుకుంది అక్కడి దుస్థితి. ఇప్పటి వరకు మహారాష్ట్రలో 1,982 మందికి కరోనా సోకగా 150 మంది మృతిచెందారు. మరో దారుణమైన విషయం ఏంటంటే.. ఓ మహారాష్ట్ర మంత్రి కూడా క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. 

 

 

గృహనిర్మాణ శాఖ మంత్రి జితేంద్ర క్వారంటైన్ కు వెళ్లారు. ఆయనకు ఓ పోలీస్ అధికారి ద్వారా కరోనా సోకి ఉండొచ్చన్న  వాదన వినిపిస్తోంది. ఎందుకంటే.. కొద్ది రోజుల క్రితం ఆయనను కలిసిన పోలీసు అధికారికి కరోనా పాజిటివ్ వచ్చింది. జితేంద్ర ఠాణా జిల్లాలో కల్వాముంబ్రా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆ పోలీసు అధికారి రెండువారాల క్రితం మంత్రిని కలిశారు. అతనికి పాజిటివ్ అని తేలడంతో మంత్రి స్వీయ నిర్భంధంలోకి వెళ్లారు. ప్రజలు ఎవరూ తనను కలవడానికి రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. 

 

 

ఇంకా కొన్ని జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. దీనికి తోడు ముంబైలోని అతి పెద్ద మురికి వాడ ధారవిలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. పరిస్థితులు చూస్తుంటే.. మహారాష్ట్ర దేశ కరోనా రాజధానిగా మారిపోయే ప్రమాదం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్రలో అక్కడ కొందరు అధికారులకు కూడా కరోనా పాజిటివ్ అని తేలుతోంది.  ఇక్కడ కరోనా అదుపులో మొదట్లో నిర్లక్ష్యం వహించడమే ఇంతటి దారుణానికి కారణమన్న వాదన కూడా వినిపిస్తోంది. ఏదేమైనా మహారాష్ట్రలో పరిస్థితులు మొత్తం దేశాన్నే భయపెట్టేలా ఉంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: