ప్రధాని మోదీ ఈరోజు ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. కేంద్రం ప్రస్తుతం అమలవుతున్న లాక్ డౌన్ ను మరో రెండు వారాల పాటు పొడిగించనుంది. కేంద్రం దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రత్యేక ప్రకటనలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. బడుగు జీవుల జీవనోపాధికి ఇబ్బందులు తొలగించే విధంగా మోదీ కీలక ప్రకటనలు చేయనున్నారని తెలుస్తోంది. కేంద్రం ప్రకటన కొరకు వేచి చూడకుండానే ఇప్పటికే పలు రాష్ట్రాలు ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు ప్రకటన చేశాయి. 
 
కేంద్రం పరిమిత సంఖ్యతోనే అన్ని వ్యవస్థలను ముందుకు నడిపించేందుకు వెసులుబాటు కల్పించనుందని తెలుస్తోంది. మూతబడ్డ పరిశ్రమలు తెరిచేందుకు కేంద్రం అనుమతులు ఇవ్వనుందని సమాచారం. పూర్తి వ్యవస్థను స్తంభించేలా లాక్ డౌన్ ను కొనసాగిస్తే ఆర్థిక పరిస్థితి దిగజారే అవకాశం ఉందని భావించి కేంద్రం రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల ఆధారంగా వెసులుబాటు కల్పించనుంది. కేంద్రం షాపింగ్ మాల్స్, థియేటర్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, కళ్యాణ మండపాలకు మాత్రం భారీ షాక్ ఇవ్వనుందని వాటి విషయంలో యథావిధిగా ఆంక్షలు కొనసాగనున్నాయని తెలుస్తోంది. 
 
కేంద్రం 21 రోజుల లాక్ డౌన్ వల్ల సామాన్య ప్రజలు పెద్దగా ఇబ్బందులు పడలేదు. కానీ లాక్ డౌన్ ను కేంద్రం కొనసాగిస్తే మాత్రం నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అందువల్ల కేంద్రం ఆంక్షల్లో సడలింపులు ఇవ్వనుందని తెలుస్తోంది. రైళ్లు, విమానాల రాకపోకల విషయంలో కేంద్రం కీలక ప్రకటన చేయనుందని సమాచారం. దేశీయ విమాన సర్వీసులకు కేంద్రం అనుమతులు ఇవ్వనుందని తెలుస్తోంది. 
 
ప్రధాని మోదీ ప్రకటన కోసం దేశ ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మోదీ పిలుపు మేరకు 21 రోజులు ఇళ్లకే పరిమితమైన ప్రజలు లాక్ డౌన్ ను పొడిగించాలనే కోరుతున్నారు. కరోనాను కట్టడి చేయడానికి లాక్ డౌన్ తప్ప మరో మార్గం లేదని చెబుతున్నారు. అదే సమయంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: