ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా మే నెల 3 వరకు లాక్ డౌన్ అమలవుతుందని ప్రకటన చేసిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ అమలు వల్ల మద్యం ప్రియులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. లాక్ డౌన్ అమల్లో ఉండటంతో మద్యం ఉత్పత్తి కంపెనీలు రాష్ట్రంలో మూతబడ్డాయి. అయితే తాజాగా మద్యం ఉత్పత్తి కంపెనీలు వ్యాపారాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో ఇంటికే బీర్లు డెలివరీ చేసేలా అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాశాయి. 
 
అఖిల భారత బ్రువరీస్ సంఘం రాసిన ఈ లేఖపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. ప్రభుత్వం అనుమతి ఇస్తే మాత్రం బీర్లు డోర్ డెలివరీ కానున్నాయి. కరోనా వల్ల మద్యం ప్రియులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. మద్యం దొరక్క కొందరు విచిత్రంగా ప్రవర్తిస్తుంటే... మరికొందరు మానసికంగా కృంగిపోతున్నారు. పలు ప్రాంతాల్లో మద్యం దొరక్క ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. 
 
మద్యం ఉత్పత్తి కంపెనీలు రాసిన లేఖలు తాము తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి కూడా లాభం చేకూరుతుందని పేర్కొన్నాయి. బ్రువరీస్ సంఘం దేశంలోని అన్ని రాష్ట్రాలకు మందుబాబులకు బీర్ డోర్ డెలివరీ చేస్తామని లేఖ రాయగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు అంగీకరించాయని సమాచారం. మద్యం ఉత్పత్తి సంస్థలు లాక్ డౌన్ వల్ల తమకు 16,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లనుందని చెబుతున్నాయి. 
 
బ్రువరీస్ సంఘం బీర్లు తయారు చేయడానికి కావాల్సిన చక్కెర, బియ్యం, గోధుమలు, బార్లీ రైతుల నుంచి సమకూర్చుకుంటున్నట్లు పేర్కొంది. బీర్ల ఉత్పత్తి తగ్గితే రైతులకు కూడా నష్టం వాటిల్లుతుందని... తమకు అనుమతి ఇస్తే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ బీర్లు డెలివరీ చేస్తామని పేర్కొంది. ఈ లేఖ విషయంలో ఏపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.     

మరింత సమాచారం తెలుసుకోండి: