దేశంగా కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. మార్చి నెల 24 నాటికి దేశంలో 600 కరోనా కేసులు నమోదు కాగా నిన్నటివరకు 11439 కేసులు నమోదయ్యాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ప్రతిరోజు పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపడుతున్నా కరోనా పంజా విసురుతూనే ఉంది. చైనాలోని వుహాన్ లో పుట్టిన ఈ కరోనా వైరస్ ఏ జంతువు నుంచి మనుషులకు వ్యాప్తి చెందిందో తెలుసుకోవడానికి రకరకాల పరిశోధనలు జరుగుతున్నాయి.
 
ప్రపంచ దేశాలు ఈ వైరస్ పై, వ్యాక్సిన్ పై పరిశోధనలు చేస్తున్నాయి. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) కరోనా వైరస్ గురించి చేసిన పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. మన దేశంలో పలు రాష్ట్రాల్లో నివశించే గబ్బిలాల్లో కరోనా వైరస్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి సంబంధించిన కథనం వైద్య పరిశోధనలకు సంబంధించిన జర్నల్ లో ప్రచురితమైంది. ఐసీఎంఆర్ పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీతో కలిసి ఈ పరిశోధనలు చేసింది. 
 
శాస్త్రవేత్తలు రౌసెటస్, టెరోపస్ అనే రెండు జాతులకు చెందిన గబ్బిలాల్లో కరోనా వైరస్ ను గుర్తించారు. గతంలో ఈ గబ్బిలాల ద్వారా నిఫా వైరస్ వ్యాపించింది. మన దేశంలో నిఫా వైరస్ భారీన పడి 17 మంది చనిపోయారు. శాస్త్రవేత్తలు గబ్బిలాల్లో కరోనా వైరస్ ను గుర్తించడం ఇదే తొలిసారి. శాస్త్రవేత్తలు మొత్తం 25 గబ్బిలాల నమూనాలను సేకరించి పరిశోధనలు జరిపారు. 
 
హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కనిపించే గబ్బిలాల్లో మాత్రమే ఈ వైరస్ గుర్తించామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ గబ్బిలాల్లో గుర్తించిన వైరస్ కరోనాకు కారణమో కాదో ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శాస్త్రవేత్తలు గతంలోనే ఆరు రకాల కరోనా వైరస్ లను గుర్తించగా ఈ వైరస్ కరోనా జాతికి చెందిన కొత్త వైరస్ అని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: