దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇతర రాష్ట్రాలతో కరోనా మహారాష్ట్రలో పంజా విసురుతోంది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో కరోనా భాదితుల సంఖ్య 2000కు చేరువవుతోంది. ముంబైలో ఇప్పటివరకు 1896 కేసులు నమోదు కాగా 114 మంది మృతి చెందారు. దేశంలోనే అత్యధిక కేసులతో దేశ కరోనా రాజధానిగా ముంబై మారింది. 
 
ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా చెప్పుకునే ధారావిలో ఇప్పటివరకు ఆరు కేసులు నమోదయ్యాయి. వీరిలో ఒకరు మృతి చెందారు. ధారావిలో మరణించిన వ్యక్తి తబ్లీగీ జమాత్ కార్యక్రమానికి హాజరైనట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు మహారాష్ట్ర రాష్ట్రంలో నిన్న 232 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బాధితుల సంఖ్య 2916కు చేరింది. మహారాష్ట్రలో ఇప్పటివరకు 187 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. 
 
ముంబై నగరంలో గడచిన 5 రోజుల్లోనే 750 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో మృతుల సంఖ్య 76 నుంచి 114కు పెరిగింది. ముంబైలో కరోనా తీవ్రత తగ్గించాలనే ఉద్దేశంతో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిరోజు 1500 నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా రాష్ట్రంలో కరోనా విజృంభిస్తూనే ఉండటం గమనార్హం. 
 
మరోవైపు దేశంలో కరోనా బాధితుల సంఖ్య 12,000 దాటింది. ఇప్పటివరకు 1344 మంది కరోనా నుంచి కోలుకోగా 392 మంది మృతి చెందారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా వేగంగా విజృంభిస్తోంది. తెలంగాణలో నిన్న నమోదైన కేసులతో కలిపి కరోనా బాధితుల సంఖ్య 681కు చేరగా ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 525కు చేరింది. కరోనా భారీన పడి తెలంగాణలో 18 మంది మృతి చెందగా ఏపీలో 14 మంది మరణించారు. ప్రతిరోజూ భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: