సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో మే 7వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగించిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. సీఎం ఆదేశాల మేరకు పోలీస్ శాఖ ఈరోజు నుంచి అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారిపై కఠిన చర్యలకు సిద్ధమైంది. డీజీపీ మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈరోజు నుంచి రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలు మరింత కఠినంగా అమలు కానున్నాయని తెలిపారు. 
 
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇంట్లోనూ కుటుంబ సభ్యులు వ్యక్తిగత దూరం పాటిస్తే మంచిదని సూచించారు. పోలీస్ శాఖ అనవసరంగా రోడ్లపైకి వచ్చేవారిని గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోందని అన్నారు. గతంలో పోలీస్ శాఖ నిత్యావసర వస్తువులు, అత్యవసర సేవలు అందించే వారి కోసం 15,000 పాసులు ఇచ్చిందని ఈ పాసులు దుర్వినియోగమవుతున్నట్టు గుర్తించడంతో వీటన్నింటినీ రద్దు చేయబోతున్నట్లు ప్రకటన చేశారు. 
 
విధులకు హాజరయ్యే ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్కో రోజుకు ఒక్కో గుర్తింపు కార్డు ఇవ్వాలని ఆయా శాఖలకు ఆదేశించామని చెప్పారు. నిత్యావసర వస్తువుల కోసం బయటకు వచ్చేవారు అడ్రస్ ప్రూఫ్ కు సంబంధించిన పత్రం వెంట తెచ్చుకోవాలని.... ఎవరైనా ఈ నిబంధనను ఉల్లంఘిస్తే పోలీసులు వారిపై చర్యలు తీసుకుంటారని చెప్పారు. అనవసరంగా రోడ్డు మీదకు వచ్చిన 1,21,000 వాహనాలను ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్నామని ఈ వాహనాలపై కేసులు నమోదు చేసి న్యాయస్థానానికి పంపించనున్నామని తెలిపారు. 
 
జీ.హెచ్.ఎం.సీ అనుమతి తీసుకుని మాత్రమే పేదలకు ఆహారం పంపిణీ చేయాలని... వ్యక్తిగత దూరం తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఆస్పత్రులు, మెడికల్ షాపులు, నిత్యావసర వస్తువుల దుకాణాల నిర్వాహకులు వ్యక్తిగత దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని... లేకపోతే అనుమతులు రద్దు చేస్తామని పేర్కొన్నారు. ఇంటి అద్దె విషయంలో యజమానులు మాట వినకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీఎం కేసీఆర్ నూతన నిబంధనల ద్వారా రాష్ట్రంలో లాక్ డౌన్ మరింత కఠినంగా అమలు జరిగేలా చర్యలు చేపట్టారు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించడానికి ప్రయత్నిస్తే వారికి పోలీస్ శాఖ భారీ షాక్ ఇవ్వనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: