దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రతిరోజు వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశంలో సాఫ్ట్ వేర్ రంగం మినహా మిగతా అన్ని రంగాలపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. లాక్ డౌన్ వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. పరీక్షలు వాయిదా పడటంతో విద్యార్థులు ఇప్పటివరకు చదివిన పాఠాలు మరిచిపోతామేమోనని భయాందోళనకు గురవుతున్నారు. 
 
మరోవైపు డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే పట్టాలు ఇచ్చేస్తారని సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు న్యూ అకాడమిక్ ఇయర్ విషయంలో స్పష్టత లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి విద్యార్థుల తల్లిదండ్రులకు అనేక అంశాల గురించి స్పష్టత ఇచ్చారు. 
 
పాపిరెడ్డి మాట్లాడుతూ డిగ్రీ, ఇంజనీరింగ్ ఇతర ప్రొఫెషనల్ కోర్సులకు కొంత ఆలస్యమైనా పరీక్షలు తప్పనిసరిగా నిర్వహిస్తామని తెలిపారు. పరీక్షలు నిర్వహించకుండా డిగ్రీలు ఇచ్చే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు. ఎంహెచ్‌ఆర్‌డీ కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం, ఫైనల్‌ ఇయర్‌ విద్యార్దులకు పరీక్షల నిర్వహణపై రెండు కమిటీలను ఏర్పాటు చేసిందని ఆ కమిటీలు ఇప్పటికే నివేదికలు సమర్పించాయని చెప్పారు. 
 
త్వరలోనే కమిటీ నివేదికలను సంబంధించిన అధికారిక నిర్ణయాలను ప్రకటిస్తామని చెప్పారు. మరోవైపు ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు పూర్తయినా లాక్ డౌన్ వల్ల మూల్యాంకనం జరగట్లేదు. పోటీ పరీక్షల తేదీల గురించి స్పష్టత రావట్లేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి మార్కులు సాధించలేరేమోనని ఆందోళన పడుతున్నారు. తెలంగాణలో కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతూ ఉండటంతో ప్రజలకు ఊరట కలుగుతోంది. రాష్ట్రంలో గత నాలుగు రోజుల నుంచి తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. సీఎం కేసీఆర్ లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయడం వల్లే కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: