మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ జగన్ సర్కార్ పై మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మూర్ఖ నిర్ణయం వల్ల ఇన్నిరోజులు కరోనా వారియర్స్ చేసిన కృషి అంతా వ్యర్థమైందని అన్నారు. జగన్ సర్కార్ ఏపీలో మద్యం దుకాణాలకు అనుమతులు ఇచ్చి జేబు నింపుకునే పథకాన్ని ప్రారంభించిందని విమర్శలు చేశారు. మద్యం దుకాణాల క్యూ లైన్ల దగ్గర జనం బారులు తీరుతూ తోసుకుంటున్నారని... రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా...? సీఎం జగన్ కు దూర దృష్టి ఉందా...? అని ప్రశ్నించారు. 
 
పేదవాళ్లు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని 40 రోజులు ఇంటికే పరిమితమయ్యారని... ప్రభుత్వం మద్యం దుకాణాలకు అనుమతులు ఇచ్చి కరోనా కేసుల సంఖ్య పెరిగేలా వ్యవహరిస్తోందని అన్నారు. డాక్టర్లు, నర్సులు కరోనా కట్టడి కోసం కృషి చేస్తే జగన్ సర్కార్ ఆదాయం సంపాదించుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని విమర్శలు చేశారు. రాష్ట్రంలో నాటుసారా ఏరులై పారుతోందని, గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోందని విమర్శలు చేశారు. 
 
రాష్ట్రంలో మద్యం దుకాణాల ముందు సామాజిక దూరం పాటించకుండా, మాస్కులు ధరించకుండా ఒకరినొకరు తోసుకుంటున్నారని అన్నారు. మద్యం దుకాణాల వల్ల కరోనా సోకితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. జగన్ సర్కార్ ఏ విధంగా ప్రజలకు కాపాడాలని అనుకుంటుందో చెప్పాలన్నారు. ప్రభుత్వం అన్న క్యాంటీన్ల ద్వారా భోజనం పెడితే కరోనా వస్తోందని చెబుతోందని... మద్యం దుకాణాల ద్వారా కరోనా సోకదా... ? అని ప్రశ్నించారు. 
 
నిత్యావసర సరుకులు, కూరగాయల కొనుగోలుకు ఉదయం 9 గంటల వరకే అనుమతి ఇస్తున్న ప్రభుత్వం... మద్యం దుకాణాలకు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అనుమతులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు పెట్టి తన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని అన్నారు. కర్నూలులో వైసీపీ ఎమ్మెల్యేల నిర్లక్ష్యం వల్ల ప్రముఖ డాక్టర్ చనిపోయారని అన్నారు. దేవినేని ఉమామహేశ్వరరావు జగన్ పై చేసిన వ్యాఖ్యల గురించి ప్రజలు రెండో చంద్రబాబు వచ్చాడని కామెంట్లు చేస్తూ ఉండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: