విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటన గురించి రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇప్పటివరకు లీకైన్ గ్యాస్ ను పీల్చిన పది మంది మృతి చెందగా దాదాపు 2000 మంది విశాఖలోని పలు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. విశాఖ ఘటన గురించి రాష్ట్రపతి స్పందించారు. 
 
విశాఖలోని గ్యాస్ లీకేజ్ వార్త తెలిసి చాలా బాధపడ్డానని ఆయన అన్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. అధికార యంత్రాంగం పరిస్థితిని తక్కువ సమయంలో అదుపులోకి తెస్తుందని తాను భావిస్తున్నానని అన్నారు. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈ ఘటన గురించి స్పందించారు. 
 
విశాఖ సమీపంలోని ఎల్.జీ పాలిమర్స్ కంపెనీలో చోటు చేసుకున్న ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. యుద్ధప్రాతిపదికన అన్ని రకాల చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రెడ్ క్రాస్ వాలంటీర్ల సేవలను వినియోగించుకుని ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని సూచించారు. తక్షణమే వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని విశాఖ రెడ్ క్రాస్ ను గవర్నర్ ఆదేశించారు. 
 
విశాఖ గ్యాస్ ఘటనపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. గ్యాస్ లీకేజీ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. టాలీవుడ్ సినీ ప్రముఖులు చిరంజీవి, మహేష్ బాబు, తమన్నా, అనిల్ రావిపూడి, ఇతరులు విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై సోషల్ మీడియా ఖాతాల ద్వారా స్పందించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: