ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనతో విశాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గ్యాస్ లీకేజీ వల్ల విశాఖ శివార్లలో నివశిస్తున్న ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గ్యాస్ పీల్చిన వారిలో కొందరికి శరీరంపై బొబ్బలు వస్తున్నాయి. గ్యాస్ పీల్చి అస్వస్థతకు గురైన వారిలో 52 మంది చిన్నారులే కావడం గమనార్హం. పిల్లల్లో కొందరికి న్యూమోనియా, జ్వరం వ్యాధుల లక్షణాలు కనిపిస్తున్నాయి. ఏపీ సీఎం జగన్ నిన్న విశాఖలో సహాయ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న నీలం సాహ్ని, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. 
 
విశాఖలో గ్యాస్ లీకేజీని అదుపు చేసేందుకు గుజరాత్ నుంచి జిల్లాకు నిపుణులు వచ్చారు. నిపుణులు లీకేజీని పూర్తి స్థాయిలో అదుపు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నిపుణులు స్టైరీన్ ఆవిర్ల ఉష్ణోగ్రతను 150 డిగ్రీల నుంచి 120 డిగ్రీలకు తగ్గించారు. స్టైరీన్ ట్యాంకు సేఫ్టీ వాల్వు తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పిందని నిపుణులు చెబుతున్నారు. ట్యాంకు పేలి ఉంటే మాత్రం పెను ప్రమాదం సంభవించేదని సమాచారం. 
 
వెంకటాపురానికి చెందిన రామలక్ష్మి అనే మహిళ గ్యాస్ పీల్చడంతో ఆమెకు చర్మం కమిలిపోయి బొబ్బలు వచ్చాయి. మరికొంతమంది ఆహారం తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. వైద్యులు స్టైరీన్ గ్యాస్ పీల్చిన వారిలో కిడ్నీ, కాలేయ సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉండటంతో నిర్ధారిత పరీక్షలు జరుపుతున్నారు. 
 
ఒకేసారి వందల మంది అస్వస్థతకు గురి కావడంతో పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని చెబుతున్నారు. కొన్ని రకాల పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా నమూనాను రూపొందించామని డాక్టర్ గిరినాథ్ మీడియాకు తెలిపారు. మరోవైపు కొందరు వైద్యులు గ్యాస్ పీల్చిన వారిలో వెంటనే లక్షణాలు కనిపించపోయినా భవిష్యత్తులో లక్షణాలు కనిపించే అవకాశం ఉందని... తరచుగా పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని చెబుతున్నారు.                   

మరింత సమాచారం తెలుసుకోండి: