దేశంలో కరోనా మహమ్మరి వేగంగా విజృంభిస్తూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దేశంలో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా విజృంభణతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలవుతోంది. ఆరెంజ్, గ్రీన్ జోన్లలో కేంద్రం సడలింపులు ఇచ్చినా ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని... భౌతిక దూరం పాటించాలని సూచించింది. 
 
అదే సమయంలో జనం గుంపులుగుంపులుగా గుమికూడే ఎటువంటి కార్యక్రామాలకు అనుమతించబోమని పేర్కొంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలవుతున్నాయి. అయితే ఇదే సమయంలో కర్ణాటక రాష్ట్రంలోని ఓ గ్రామంలో గ్రామదేవతకు జాతర నిర్వహించారు. ఈ జాతరకు వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. భక్తులు ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా జాతరకు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. 
 
తమిళనాడు రాష్ట్రం నుంచి కూడా ఈ జాతరకు భక్తులు హాజరయ్యారని సమాచారం. గ్రామస్తులు అమ్మోరు తల్లిని పూజిస్తే కరోనా మహమ్మారి తగ్గుతుందని వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కర్ణాటక రాష్ట్రంలోని రామనగర జిల్లా గ్రీన్ జోన్ లో ఉండటంతో అధికారులు జాతర జరుపుకోవడానికి ఆంక్షలతో అనుమతులు ఇచ్చారు. అయితే గ్రామస్తులు మాత్రం జాతరను వైభవంగా నిర్వహించారు. 
 
ఈ ఘటనతో జిల్లా యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కర్ణాటక ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటక రాష్ట్రంలో తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కానీ ఇలాంటి జాతరల వల్ల వైరస్ వేగంగా విజృంభించే అవకాశం ఉంది. అనుమతులు ఇచ్చిన అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు కేంద్రం నాలుగో విడత నిబంధనలు విడుదల చేసిన తరువాత కేంద్రం ఆదేశాలను అనుసరించి నిబంధనలను సడలించాలని కర్ణాటక సర్కార్ భావిస్తోంది.          

మరింత సమాచారం తెలుసుకోండి: