దేశంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనా విజృంభణతో కేంద్రం మరోసారి లాక్ డౌన్ ను పొడిగించింది. గత లాక్ డౌన్ లతో పోలిస్తే నాలుగో విడత లాక్ డౌన్ లో కేంద్రం భారీ సడలింపులు ఇచ్చింది. కేంద్రం అంతర్రాష్ట్ర వాహనాలకు పచ్చజెండా ఊపింది. పరస్పర అంగీకారంతో బస్సులు నడపవచ్చని ప్రకటన చేసింది. 
 
నేటి నుంచి దేశవ్యాప్తంగా దుకాణాలు తెరుచుకోనున్నాయి. విమానాలు, మెట్రో, రైళ్లు, మాల్స్ పై నిషేధం యథావిధిగా కొనసాగుతోంది. కేంద్రం జోన్లపై నిర్ణయాధికారం రాష్ట్రాలకే ఇచ్చింది. పాఠశాలలు, విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లపై నిషేధం విధించింది. కేంద్రం ఆన్ లైన్ శిక్షణకు అనుమతులు ఇచ్చింది. కేంద్ర హోం శాఖ అనుమతించిన అవసరాల కోసం మాత్రమే విమానాలు నడుస్తాయని తెలిపింది. 
 
ఈ కామర్స్ సంస్థలు అత్యవసర వస్తువులతో పాటు అన్ని రకాల వస్తువులను సరఫరా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెస్టారెంట్లలో హోం డెలివరీకి అనుమతులు ఇచ్చింది. అన్ని రకాల సరుకు రవాణా వాహనాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర పరిధిలో ప్రయాణికుల వాహనాలు, బస్సులు, ట్యాక్సీలు, ఆటోలు నడిపే అంశంపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చని కేంద్రం ప్రకటన చేసింది. 
 
మరోవైపు భారీ లాక్ డౌన్ సడలింపులపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం మూడో విడత లాక్ డౌన్ లో మద్యం దుకాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్లే కేసుల సంఖ్య భారీగా పెరిగిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. కేంద్రం కంటైన్మెంట్ జోన్లు మిగతా అన్ని ప్రాంతాలలో దుకాణాలకు అనుమతులు ఇవ్వడం, ప్రయాణ రాకపోకలకు అనుమతులు ఇవ్వడం వల్ల కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.     

మరింత సమాచారం తెలుసుకోండి: