ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సచివాలయంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులంతా గురువారం నుంచి తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కంటైన్మెంట్‌‌ ప్రాంతాల్లో ఉన్న వారికి, గర్భవతులు, ఎక్కువ వయస్సుగల వారు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి మాత్రం పరిస్థితుల ఆధారంగా ఇంటి నుంచి పనిచేసేందుకు అనుమతించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్త‌ర్వుల్లో పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి..  రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలన్నీ గురువారం నుంచి పూర్తి స్థాయిలో పనిచేస్తాయి. నూటికి నూరు శాతం ఉద్యోగులు విధులకు హాజరు కావాలి. కార్యాలయాల ప్రాంగణంలోకి ప్రవేశించే ద్వారం వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసి, చేతులను శానిటైజ్‌ చేసిన తరువాత పంపిస్తారు.  అన్ని కార్యాలయాల్లో ప్రతి రోజు శానిటైజ్‌ చేయాలి. ప్రతీ ఉద్యోగి విధిగా మాస్క్‌ ధరించి విధులకు హాజరు కావాలి. కార్యాలయాల్లో ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలి. రెండు గంటలకోసారి సబ్బు, శానిటైజర్‌తో చేతులను శుభ్రం చేసుకోవాలి. కార్యాలయాల్లో పాన్, గుట్కా, పొగాకు వినియోగం నిషేధం.

 

ఎవ్వరైనా ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటారు. ఫైల్స్, తపాల్స్‌ ఈ–ఆఫీస్‌ ద్వారానే ప్రాసెస్‌ చేయాలి. ఉత్తర ప్రత్యుత్తరాలను అధికారిక ఈ–మెయిల్స్‌ ద్వారానే చేయాలి. భౌతిక సమావేశాలు తగ్గించి టెలి, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారానే సమావేశాలను నిర్వహించాలి. ఉద్యోగులు విధుల్లో ఉండగా జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే హోం క్వారంటైన్‌లో ఉండాలి. సంబంధిత అధికారులు సెలవును మంజూరు చేస్తారు. కార్యాలయాల్లోకి సందర్శకులను అనుమతించరు. స్పందన, తపాల్‌ సెక్షన్, రిసెప్షన్స్‌లో మాత్రమే సమస్యలపై విజ్ఞాపనలు చేయాలి. కరోనా నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసే ఆదేశాలను ఉద్యోగులందరూ తప్పనిసరిగా పాటించాలి. ఈ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు, అన్ని ప్రభుత్వ కార్యాలయాల అధిపతులు చర్యలు తీసుకుని అమలు చేయాలి. ఈ నేప‌థ్యంలో రేప‌టి నుంచి ప్ర‌జ‌ల‌కు అన్నిసేవ‌లు అంద‌నున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: