క‌రోనా రోగులు బ‌య‌ట‌తిరుగుండ‌డం క‌ర్ణాట‌క‌లో క‌ల‌క‌లం రేపుతోంది. జ‌నం తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. కరోనా వైర‌స్ బారిన ప‌డ‌కుండా..బెంగళూరు గ్రామీణ జిల్లా క్షేమంగా ఉందని అధికారులు, ప్ర‌జ‌లు భావిస్తున్న తరుణంలో కరోనా సోకిన ఇద్ద‌రు రోగులు జిల్లాలో అనేకచోట్ల తిరిగారని తెలియ‌డంతో జ‌నం బెంబేలెత్తిపోతున్నారు. ప్ర‌ధానంగా దొడ్డబళ్లాపురం, నెలమంగల తాలూకాలలో ప‌రిస్థితి తీవ్ర ఆందోళ‌నాక‌రంగా మారింది. గ‌త మంగళవారంనాడు బెంగళూరు శివాజినగర్‌కు చెందిన 1207వ రోగి నెలమంగల తాలూకా బిల్లినకోటె, చుట్టుపక్కల డాబాలో, పరిసరాల్లో తిరిగి, పలువురిని కలిసి వెళ్లాడు. దీంతో డాబా యజమాని, సిబ్బంది,కలిసిన వారిని అందరినీ గుర్తించిన అధికారులు ఐసోలేషన్‌ వార్డ్‌కు తరలించారు. అలాగే.. పీ–1364 బెంగళూరులో ఆకస్మికంగా మృతిచెందాడు. అతడికి కరోనా సోకినట్టు మృతి చెందిన తరువాత రక్త పరీక్షల్లో తేలింది.

 

ఇతడు దొడ్డబళ్లాపురం తాలూకా సీగేహళ్లి గ్రామానికి చెందిన వ్యక్తి. ఈ నెల 16వ తేదీన తన భార్య, కుమారునితో వచ్చి బంధువులను కలిసి వెళ్లాడు. అంతటితో ఆగకుండా నెలమంగల తాలూకా హుల్లెహరివె గ్రామంలో నివసిస్తున్న తన చెల్లెలు ఇంటికి వెళ్లి ఆ ఇంట్లోని బాలింతను, పసిబిడ్డను చూసి వెళ్లిపోయాడు. బెంగళూరులో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బంధువు ఆరోగ్యాన్ని విచారించడానికి వెళ్లి అక్కడే గుండెపోటుతో చనిపోయాడు. కరోనా అని తేలడంతో ఆరోగ్యశాఖ అధికారులు తక్షణం మృతుడు తిరిగిన ప్రాంతాలకు వెళ్లి, కలిసిన వారందరికీ ఆరోగ్య పరీక్షలు చేసి ముందు జాగ్రత్త చర్యగా క్వారంటైన్‌కు తరలించారు. ఈ ప‌రిణామాల‌తో స్థానికంగా ప్ర‌జ‌లు బిక్కుబిక్కుమంటూ గ‌డుపుతున్నారు. కాగా, కర్ణాటకలో నిన్న‌ 63 కొత్త కొవిడ్ -19 కేసులు నమోదయ్యాయని , రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసుల‌ సంఖ్య 1,458 గా ఉందని ఆరోగ్య శాఖ బుధవారం తెలిపింది. ఇప్ప‌టివ‌ర‌కు 40 మరణాలు సంభ‌వించ‌గా.. 553మంది కోలుకుని ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో 864  కరోనావైరస్ యాక్టివ్‌ కేసులు ఉన్నాయని అధికారులు వెల్ల‌డించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: