తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు ప్రగతి భవన్ లో మంత్రులు, అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ఉద్యోగుల, ప్రజాప్రతినిధుల మే నెల వేతనాల్లో కోత విధించనున్నట్టు తెలిపారు. ఆసరా పింఛన్లను యథాతథంగా కొనసాగిస్తామని ఆయన అన్నారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత విధిస్తున్నట్టు తెలిపారు. 
 
రేషన్ కార్డు లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం ఇవ్వాలని... ప్రతి కుటుంబానికి 1500 రూపాయలు నగదు ఇచ్చే కార్యక్రమాన్ని మాత్రం నిలిపివేయాలని తెలిపారు. రాష్ట్రానికి నెలకు 12,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదని మే నెలలో కేంద్రం ఇచ్చిన వాటాతో కలుపుకుని కేవలం 3,100 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయని అన్నారు. లాక్ డౌన్ నిబంధనల్లో సడలింపులు ఇచ్చినా రవాణా, రిజిస్టేషన్ల రంగాలలో పెద్దగా రాలేదని సీఎంకు అధికారులు చెప్పారు. 
 
ఎఫ్.ఆర్.బీ.ఎం పరిమితి పెరిగిందని కానీ కేంద్రం అనేక షరతులు విధించడం వల్ల అదనపు రుణాలు సమకూర్చే పరిస్థితి కనిపించడం లేదని అధికారులు సీఎంతో అన్నారు. ఉద్యోగుల జీతాలతో పాటు పింఛన్లను చెల్లిస్తే ఖజానా ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొందని... అధికారులు సీఎంకు వివరించారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వేతనాల్లో కోత విధించాలని నిర్ణయం తీసుకున్నారు. 
 
గత నెలలో విధించిన విధంగానే ఈ నెలలోనూ వేతనాల్లో కోతలు అమలు కానున్నాయి. ప్రభుత్వం కర్ఫ్యూ నుంచి ఆర్టీసీ బస్సులను మినహాయించింది. జిల్లాల నుంచి వచ్చే బస్సులను ఎంజీ.బీ.ఎస్ లోనూ ఆపేందుకు అనుమతులు ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. సిటీ బస్సులకు, ఇతర రాష్ట్రాల బస్సులకు అనుమతులు ఇవ్వడం లేదని ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడింది. హైదరాబాద్ లో మాల్స్ మినహా అన్ని దుకాణాలకు రేపటి నుంచి అనుమతులు ఇస్తున్నట్టు తెలిపింది. ప్రభుత్వం రాష్ట్రంలో సరి బేసి నిబంధనలను ఎత్తివేసింది. ఒకే షాపులో ఎక్కువ మంది గుమికూడే అవకాశం ఉందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: