ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం చోటు చేసుకుంది. జగన్ ఏడాది పూర్తి చేసుకున్న ఆనందం కూడా పూర్తిగా లేకుండా శుక్రవారం నిమ్మగడ్డను తొలగించేందుకు ఏపీ సర్కారు ఇచ్చిన ఆర్డినెన్స్ చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఏపీ సర్కారుకు ఇది చాలా పెద్ద దెబ్బే.. ప్రత్యేకించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డతో జగన్ సర్కారు ఢీ అంటే ఢీ అని ప్రవర్తించింది. నిమ్మగడ్డ ఎస్‌ఈసీ కొనసాగడం ఏమాత్రం ఇష్టం లేని జగన్.. ఆయన్ను తప్పించేందుకు ఏకంగా ఆర్డినెన్స్ ప్రయోగించారు.

 

 

కానీ హైకోర్టు ద్వారా నిమ్మగడ్డ మళ్లీ జగన్ పై పైచేయి సాధించారని అంతా భావించారు. కానీ శనివారం అనూహ్యంగా జగన్ మరోసారి నిమ్మగడ్డకు ఝలక్ ఇచ్చారు. హైకోర్టు తీర్పు తర్వాత నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఓ ప్రకటన చేస్తూ మళ్లీ తాను బాధ్యతలు చేపట్టానని తెలిపారు. అయితే.. అసలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనకు తాను ప్రకటించుకోవడం చెల్లదని ఏపీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ ప్రకటించారు. తాను హైకోర్టు జడ్జిమెంట్ సర్టిఫైడ్ కాపీ చూసిన తర్వాత, అందులోని అంశాల ఆధారంగా ప్రభుత్వానికి ఈ విషయం తెలిచేశానని ఆయన అంటున్నారు.

 

 

రమేష్ కుమార్ తనకు తాను ఎన్నికల కమిషనర్ గా ప్రకటించుకోవడం చట్టవిరుద్దమని ఏజీ శ్రీరామ్ చెప్పారు. హైదరాబాద్ లో ఉండి ఆయన ఇక్కడి అధికారులకు ఆదేశాలు ఇచ్చారని.. వాటిని పాటించవలసిన అవసరం లేదని తాను ప్రభుత్వ అధికారులకు తెలియచేశానని ఏజీ శ్రీరామ్ అన్నారు. ఎన్నికల కమిషన్ స్టాండింగ్ కౌన్సిల్ గా ఉన్న ప్రభాకర్ ను రాజీనామా చేయాలని రమేష్ కుమార్ కోరారని, ఆ విషయం తనకు ప్రభాకర్ తెలిపారని, తాను వాటిని పాటించవలసిన అవసరం లేదని చెప్పానని ఏజీ శ్రీరామ్ అన్నారు.

 

 

అంతే కాదు.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను మళ్లీ ఎస్‌ఈసీగా మళ్లీ ప్రభుత్వమే నియమించాలని అప్పటి వరకూ ఆయన ఎస్‌ఈసీ కాదని శ్రీరామ్ తెలిపారు. ఇందుకు తమకు మరో 2 నెలల సమయం ఉందని శ్రీరామ్ చెప్పారు. అంటే ఇంకో రెండు నెలల వరకూ నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్ కాదన్నమాట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: