తెలంగాణలోని  పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని  కాంగ్రెస్ పార్టీ  నాయకత్వం  జలదీక్ష చేపట్టాలని నిర్ణయించింది . జలదీక్షకు బయల్దేరిన కాంగ్రెస్   అగ్ర నేతలను  రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడిక్కడ పోలీసులు అరెస్టు చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది . రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్తోన్న కాంగ్రెస్ నేతలను ఎక్కడిక్కడ అరెస్టు చేయడం , గృహ నిర్బంధం చేయడం ద్వారా అధికార పార్టీ , విపక్షానికి ఎటువంటి మైలేజీ రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు  స్పష్టం అవుతోంది .

 

అయితే కాంగ్రెస్ నేతలను అడ్డుకోవడం ద్వారా ఆ పార్టీకి మైలేజీ  రాకుండా అడ్డుకోవాలన్న అధికార పార్టీ వ్యూహం బెడిసికొట్టినట్లు కన్పిస్తోంది . ఒకవేళ కాంగ్రెస్ నేతలు  జలదీక్ష చేపట్టిన కూడా  రాని మైలేజీ , కాంగ్రెస్ అగ్ర నేతలను పోలీసులు ఎక్కడిక్కడ అడ్డుకోవడం, అరెస్టు చేయడం  వల్ల  వారికి  లభించినట్లయింది . కాంగ్రెస్ నేతలకు మీడియా లో , పత్రిక కథనాల్లో ఆశించినదానికంటే ఎక్కువే కవరేజ్ లభించడానికి అధికార పార్టీ ఆస్కారం కల్పించినట్లయింది  .   కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు లాక్ డౌన్ ఆంక్షల నేపధ్యం లో కాంగ్రెస్ పార్టీ చేపట్టతలపెట్టిన జలదీక్షకు అనుమతి లేదని పోలీసులు ముందస్తుగానే  వెల్లడించారు  .

 

జలదీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించడం తో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం జలదీక్ష ను కాస్త ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమంగా మార్చింది . ఎస్ ఎల్ బి సి ప్రాజెక్టు సందర్శనకు వెళ్తోన్న  టి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి , భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి , మాజీ మంత్రి జానా రెడ్డి లను ఉమ్మడి  నల్గొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు .  ఉత్తమ్ , కోమటి రెడ్డి లను పోలీసులు అరెస్టు చేయడం పట్ల స్థానిక కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ  ఆందోళనకు దిగారు .  

మరింత సమాచారం తెలుసుకోండి: