దేశంలో కరోనా విజృంభణ వల్ల కేంద్రం లాక్ డౌన్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. దీంతో కేంద్ర ఆర్థిక శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది కొత్త పథకాలేవీ ప్రవేశపెట్టబోమని కీలక ప్రకటన చేశారు. దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. 
 
ఇటీవల కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీలు మినహాయించి ఎలాంటి కొత్త ప్రభుత్వ పథకాలు ఉండవని ఆమె స్పష్టం చేశారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అభియాన్, ఆత్మనిర్భర్ భారత్, ఇతర ప్రత్యేక పథకాలకు మాత్రమే నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఇప్పటికే బడ్జెట్ ఆమోదం పొందిన ఇతర పథకాలను మార్చి 31, 2021 వరకు నిలిపివేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ఆర్థిక శాఖ బడ్జెట్ ఆమోదం పొందిన పథకాలను కూడా నిలిపివేయడం ప్రజలకు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. 
 
ఇతర మంత్రిత్వ శాఖలకు కొత్త పథకాలకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తులు కూడా పంపవద్దని ఆర్థిక శాఖ సూచనలు చేసింది. గడచిన 24 గంటల్లో దాదాపు 10,000 కేసులు నమోదు కావడంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 2,27,273కు చేరుకుంది. దేశంలో కరోనా మృతుల సంఖ్య 6,367కు చేరింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ ఉండటంతో భారత్ ఈరోజు నమోదయ్యే కేసులతో ఇటలీని కూడా దాటి ఆరో స్థానానికి చేరే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. 
 
లాక్ డౌన్ వల్ల దేశంలో కరోనా మరణాల సంఖ్య తగ్గినప్పటికీ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం ప్రజల్లో భయాందోళన పెంచుతోంది. కరోనా కట్టడి కోసం దాదాపు రెండు నెలలు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలు పడిపోయాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో పరిమితంగా ఉన్న వనరులను మారుతున్న ప్రాధాన్యతలకు అనుగుణంగా వినియోగించాల్సిన అవసరం ఉందని ఆర్థిక శాఖ తెలిపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: