ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. నదుల పరిసర గ్రామాల ప్రజలకు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో ఇసుక వ్యవహారంపై సీఎం ప్రధానంగా దృష్టి పెట్టారు. మంత్రి పెద్దిరెడ్డి రామంద్రారెడ్డి, అధికారులతో సీఎం జగన్ ఇసుక గురించి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పుడిప్పుడే మళ్లీ రీచ్‌లు ప్రారంభమవుతున్నాయని అధికారులు సీఎంకు చెప్పారు. 
 
రాష్ట్రంలో వారం రోజుల్లో ఇసుక 3 లక్షల టన్నుల ఉత్పత్తికి చేరుకుంటుందని అధికారులు సీఎంకు చెప్పారు. ఈ సందర్భంగా సీఎం అధికారులకు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలోని ప్రజలకు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్‌కు అవకాశం కల్పించాలని చెప్పారు. శాండ్ పోర్టల్ ఓపెన్ చేసిన వెంటనే ఇసుక నిల్వలు ఖాళీ అవుతున్నాయనే భావన ప్రజల్లో ఉండకూడదని తెలిపారు. 
 
నదుల పరిసర గ్రామాల ప్రజల సొంత అవసరాలకు ఎడ్ల బండ్ల ద్వారా ఇసుకను ఉచితంగా తీసుకెళ్లడానికి అనుమతించాలని సీఎం అధికారులకు చెప్పారు. పంచాయతీ కార్యదర్శి నుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్న షరతుతో వారికి ఇసుకను ఉచితంగా అందజేయాలని అన్నారు. ఎవరైనా ఎడ్ల బండ్ల ద్వారా ఇసుకను ఉచితంగా తీసుకెళ్లి ఎవరికైనా విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. 
 
సొంత అవసరాలకే ఎడ్ల బండ్లలో ఉచితంగా ఇసుక తీసుకెళ్లేలా చూడాలని అధికారులకు చెప్పారు. ఇసుక బుకింగ్స్ కు మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అవకాశం కల్పించాలని చెప్పారు. శాండ్ పోర్టల్ నుంచి బల్క్ ఆర్డర్లను తొలగించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. బల్క్‌ ఆర్డర్లకు అనుమతుల అధికారం జాయింట్‌ కలెక్టర్‌కు అప్పగించాలని చెప్పారు. ప్రభుత్వ నిర్మాణాలకు సూపరింటెండెంట్‌ ఇంజినీర్, జేసీల ద్వారా బల్క్ బుకింగ్ కు అవకాశం ఇవ్వాలని చెప్పారు.               

మరింత సమాచారం తెలుసుకోండి: