ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఉగ్ర రూపం దాలుస్తోంది. ప్రపంచ దేశాలు కరోనా ధాటికి చిగురుటాకులా వణుకుతున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతున్న వేళ ప్రపంచ దేశాలన్నీ కరోనా వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నాయి. కరోనా మహమ్మారికి చెక్ పెట్టే వ్యాక్సిన్ మరో మూడు నెలల్లో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. బ్రిటిష్ ఫార్మా దిగ్గజ సంస్థ అస్ట్రాజెనెకా ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించడం గమనార్హం. 
 
ఏ.జెడ్.ఢీ 1222 జేఏబీ పేరుతో వ్యాక్సిన్ తయారీ ప్రారంభమైంది. సెప్టెంబర్ నెలలోపు 10 కోట్ల వ్యాక్సిన్ లు అందుబాటులో ఉంటాయని సంస్థ ప్రకటన చేసింది. ఆగష్టు నెలలోపు అన్ని పరీక్షలు పూర్తవుతాయని.... పరీక్షలు పూర్తయ్యేలోపు మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు వ్యాక్సిన్ సిద్ధంగా ఉంటుందని ప్రకటన చేసింది. కరోనాకు వ్యాక్సిన్ ను కనిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. 
 
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటివరకు వాటిలో 12 సంస్థలను గుర్తించింది. వాటిలో ఆక్స్ ఫర్డ్ వర్సిటీ ఒకటి. ఈ వర్సిటీ ఏ.జెడ్.ఢీ 1222 జేఏబీ పేరుతో తయారు చేసిన వ్యాక్సిన్ ను 18 - 55 ఏళ్ల మధ్య ఉన్న ఆరోగ్యకర వాలంటీర్లపై ప్రయోగించింది. ఈ ట్రయల్స్ ఇప్పటికే సక్సెస్ అయ్యాయి. దీంతో మరో దశ ప్రయోగాలకు ఆక్ ఫర్డ్ వర్సిటీ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ ప్రయోగం కోసం వివిధ వయస్సులను చెందిన 10,260 మంది వాలంటీర్లను సిద్ధం చేసింది. 
 
ఆక్స్ ఫర్డ్ సంస్థ నాలుగు దేశాల్లో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ బ్రిటన్, భారత్, నార్వే, స్విట్జర్లాండ్ దేశాల్లో వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభించింది. ఆస్ట్రాజెనెకా సీఈవో పాస్కల్ సారియట్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ సంస్థ కూడా లాభం చూసుకోకూడదని అన్నారు. ఆగష్టు నెలలోపు అన్ని ప్రయోగాలు పూర్తవుతాయని ఆశిస్తున్నామని... సెప్టెంబర్ నెలలో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: