నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయన తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం నుంచి ఓ టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ టీజర్‌లో బాలయ్యమాస్ డైలాగ్ వేసి అభిమానుల్లో కొత్త ఊపు తెచ్చారు. “ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి రా... శ్రీను గారు మీ నాన్న గారు బాగున్నారా అనే దానికి శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నారా అనే దానికి చాలా తేడా ఉంది రా... అంటూ ఓ భారీ డైలాగ్ వదిలారు.

 

ఈ డైలాగ్‌కు నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. బాలయ్య పుట్టినరోజుకు సరైన గిఫ్ట్ దొరికిందంటూ టీజర్‌ని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఇదే క్రమంలో టీడీపీ అభిమానులు ఈ డైలాగ్‌లో ఇంకో కోణం పట్టుకుని ఆనందపడుతున్నారు. ఈ డైలాగ్ మంత్రి కొడాలి నానికి కౌంటర్‌గా వచ్చిందంటూ పోస్టులు పెడుతున్నారు. ‘అమ్మ మొగుడు’ అంటూ బూతులతో రెచ్చిపోయే కొడాలి నానికి బాలయ్య గట్టి పంచ్ ఇచ్చారని హడావిడి చేస్తున్నారు.

 

అయితే మొన్న ఆ మధ్య సన్నబియ్యం విషయంలో టీడీపీ నేత దేవినేని ఉమా. కొడాలి నానిపై విమర్శలు చేశారు. సన్నబియ్యం ఇవ్వకుండా మోసం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఇక దీనికి కొడాలి నాని కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు. సన్నబియ్యం ఇస్తామని నీయమ్మ మొగుడు ఎవరైనా చెప్పారంటూ ఘాటు పదజాలం వాడారు. ఇక దీనిపై టీడీపీ నేతలు అప్పుడే కొడాలిపై విమర్శలు చేశారు.

 

కానీ ఇప్పుడు బాలయ్య సినిమాలో ఆ డైలాగ్ రావడంతో టీడీపీ వాళ్ళు, మాత్రం కొడాలి నానికే కౌంటర్ వేశారని మాట్లాడుతున్నారు. ఇక దీనికి కొడాలి నాని నుంచి ఏమైనా బాలయ్యకు  కౌంటర్ వస్తుందా అని పోలిటికల్ వర్గాల్లో హాట్ చర్చ నడుస్తోంది. అయితే నందమూరి ఫ్యామిలీ విషయంలో కొడాలి ఎప్పుడు విమర్శలు చేయరు. కాబట్టి అలాంటిదేమీ ఉండకపోవచ్చని కొడాలి అభిమానులు చెబుతున్నారు. కేవలం ఆ డైలాగ్‌ని సినిమా పరిధి వరకే చూస్తామని, కానీ టీడీపీ వాళ్ళు మాత్రం హడావిడి చేసి ఆత్మానందం పొందుతున్నారని మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: