తెలంగాణ సర్కార్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అధిక సంఖ్యలో కేసులు నమోదవుతూ ఉండటంతో హైదరాబాద్‌లో సిటీ బస్సు సర్వీసులను ఇప్పట్లో పునరుద్దరించే ఆలోచన లేదని స్పష్టం చేసింది. సీఎం కేసీఆర్ ఎయిర్‌పోర్ట్‌ సర్వీసులను కూడా నడపవద్దని ఆదేశాలు జారీ చేశారు. సీఎం కేసీఆర్ నిన్న 5 గంటల పాటు సమీక్ష నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందాలు కుదుర్చుకున్న తరువాతే అంతర్రాష్ట్ర సర్వీసులను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. 
 
కేంద్రం లాక్ డౌన్ ఆంక్షలు సడలించినప్పటికీ తెలంగాణలో ఇప్పటివరకు అంతర్రాష్ట్ర సర్వీసులు ప్రారంభం కాలేదు. ఏపీఎస్ఆర్టీసీ హైదరాబాద్ కు బస్సులు నడపటానికి సిద్ధమని ఇప్పటికే ప్రకటన చేసింది. సీఎం కేసీఆర్ ప్రస్తుతం కొత్త మెలిక పెట్టారని తెలుస్తోంది. ఏపీకి చెందిన బస్సులు తెలంగాణలో ఎక్కువ సంఖ్యలో తిరుగుతుండగా తెలంగాణ బస్సులు మాత్రం ఏపీకి తక్కువగా తిరుగుతున్నాయి. 
 
దీంతో సీఎం కేసీఆర్ తెలంగాణ నుంచి ఏపీకి ఎన్ని సర్వీసులు నడిపితే ఏపీ కూడా అన్ని సర్వీసులు నడిపేలా ఒప్పందం చేసుకోవాలని భావిస్తున్నారు. ఈ ఓప్పందం పట్ల ఏపీ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల నుంచి కేటగిరీల వారీగా(ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, లగ్జరీ, సూపర్‌ లగ్జరీ, వోల్వో) బస్సులు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతాయో.... తెలంగాణ బస్సులు కూడా ఆయా రాష్ట్రాల్లో అన్ని కిలోమీటర్ల మేరకు తిరిగేలా ఒప్పందాలు కుదుర్చుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. 
 
అధికారుల లెక్కల ప్రకారం సగటున తెలంగాణలో ఏపీ బస్సులు 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఏపీలో తెలంగాణ బస్సులు లక్ష కిలోమీటర్ల చొప్పున తిరుగుతున్నాయి. అందువల్ల తెలంగాణ ఆర్టీసీకి ఆదాయం గణనీయంగా తగ్గుతోంది. ఈ అంతరం లేకుండా చూడగలిగితే.. తెలంగాణ ఆర్టీసీకి ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరితే మాత్రం తెలంగాణ నుంచి ఏపీకి బస్సు సర్వీసులు పెరుగుతాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: