నా ఎన్నికల మేనిఫెస్టోయే నాకు భగవద్గీత, ఖురాన్, బైబిల్.. ఇది జగన్ తరచూ చెప్పే మాట. ఆ మాటను ఆయన అక్షరాలా పాటిస్తున్నారు. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా.. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటున్నారు. అందులో జగన్ మరో అడుగు వేశారు. జగనన్న చేదోడు పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2,47,040 నాయీ బ్రాహ్మణ, రజక, టైలర్ల కుటుంబాలకు సాయం అందించారు.

 

 

పాత అప్పులకు ఈ సాయాన్ని జమ చేసుకోవద్దని బ్యాంకర్లతో మాట్లాడి లబ్ధిదారులకు ఖాతాలో రూ.10 వేల చొప్పున జమ చేశారు. కొన్ని శతాబ్దాలుగా మన చుట్టూ ఉన్న సమాజంలో నివసించే ప్రజలకు సేవ చేస్తూ.. కేవలం తమ చెమటను మాత్రమే నమ్ముకొని పనిచేస్తున్న గొప్ప మనుషులు నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లు. వారి కోసం ‘జగనన్న చేదోడు’ పథకం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు సీఎం జగన్. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని, అర్హత ఉన్నవారందరికీ మేలు చేయడమే ఈ ప్రభుత్వ సిద్ధాంతమని జగన్ చెప్పారు.

 

 

లాక్‌డౌన్‌ సమయంలో నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్ల కుటుంబాలు బతకడం కష్టతరమైన పరిస్థితులు చూశామన్నారు జగన్. ఈ రోజు నా రజక సోదరులకు, నాయీ బ్రాహ్మణ సోదరులకు, దర్జీ వృత్తి చేసుకుంటున్న అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ముళ్లకు ఇచ్చిన మాట అమలు చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,25,926 మంది టైలర్ల కుటుంబాలకు, షాపులున్న 82,347 మంది రజక సోదరుల కుటుంబాలకు, షాపులున్న దాదాపు 40 వేల నాయీ బ్రాహ్మణ అన్నదమ్ముల కుటుంబాలకు.. మొత్తం 2,47,040 కుటుంబాలకు రూ.247 కోట్లు నేరుగా వారి బ్యాంక్‌ అకౌంట్లలోకి రూ.10 వేల చొప్పున అందజేశామన్నారు.

 

 

ఇంకా ఎవరికైనా షాపు ఉండి.. అర్హత ఉండి సాయం అందని పరిస్థితి పొరపాటున జరిగి ఉంటే.. ఎవరూ కంగారుపడాల్సిన అవసరం లేదు. గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లండి... అక్కడ జగనన్న చేదోడు పథకానికి దరఖాస్తు చేసుకునే అర్హతలు, మార్గదర్శకాలు ఉంటాయి. అర్హతలతో కూడిన పత్రాలను తీసుకొని గ్రామ సచివాలయం నుంచి దరఖాస్తు పెట్టండి.. వలంటీర్ల ద్వారా సిబ్బంది వచ్చి పరిశీలన చేస్తారు. వచ్చే నెల 10వ తేదీ వరకు మిగిలిపోయిన అర్హులందరికీ సాయం అందిస్తాం.. ఎవరూ అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు జగన్.

మరింత సమాచారం తెలుసుకోండి: