తెలుగుదేశం నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఏసీబీ పోలీసులు అరెస్టు చేశారు. తెలుగుదేశం హయాంలో ఈఎస్‌ఐ కుంభకోణానికి పాల్పడ్డారన్నది అభియోగం. సరిగ్గా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యే నాలుగు రోజుల ముందు అచ్చెన్నాయుడిని అరెస్టు చేయడం రాజకీయంగా సంచలనంగా మారింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఇది హాట్ టాపిక్ అయ్యే అవకాశం ఉంది.

 

 

అయితే అసలు ఇంతకీ అచ్చెన్నాయుడిని ఎందుకు అరెస్టు చేశారు.. ఆయన చేసిన తప్పులేంటి.. ఓసారి పరిశీలిద్దాం. అచ్చెన్నాయుడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్ఐ మందులు, పరికరాల కొనుగోళ్లలు అక్రమాలు జరిగాయని అభియోగం. ఈ మేరకు విజిలెన్స్ ఇప్పటికే ఓ నివేదిక తయారు చేసింది. ఈఎస్‌ఐకి సంబంధించిఆంధ్రప్రదేశ్‌లో 4 ఆసుపత్రులు, 3 పరీక్షా కేంద్రాలు, 78 డిస్పెన్సరీలు ఉన్నాయి. ఈఎస్‌ఐ సౌకర్యం ఉన్న ఉద్యోగులకు ఇక్కడ వైద్యసేవలు అందిస్తారు.

 

 

అయితే ఈ వైద్యశాలలకు సంబంధించిన మందులు, పరికరాల కొనుగోళ్లలో ఈ అక్రమాలు జరిగాయని విజిలెన్స్ నివేదిక చెబుతోంది. 2014 - 2019 మధ్య ఐఎంఎస్ కి ముగ్గురు డైరెక్టర్లు పని చేశారు. ముగ్గురి హయాంలోనూ కొనుగోళ్లలో అక్రమాలు జరగాయని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ చెబుతోంది. మొత్తం రూ. 975.79 కోట్ల విలువైన కొనుగోళ్లు జరిగాయి. ఈఎస్ఐలో నిబంధనల ప్రకారం నమోదయిన రేట్ కాంట్రాక్టర్ల నుంచే మందులు కొనాలి. కానీ అలా జరగలేదు. మందుల్లో రూ. 51 కోట్ల 2 లక్షలూ, ల్యాబ్ కిట్లలో రూ. 85 కోట్ల 32 లక్షలూ, సర్జికల్ ఐటెమ్స్ లో రూ. 10 కోట్ల 43 లక్షలూ, ఫర్నీచర్లలో రూ. 4 కోట్ల 63 లక్షలూ మొత్తం కలిపి రూ. 151 కోట్ల 40 లక్షలు అదనంగా ఖర్చు చేశారు.

 

 

అంతేకాదు.. టెలి హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కి పనులు ఇవ్వండి అని అచ్చెన్నాయుడు ఒక లేఖ కూడా రాశారు. లేఖ ఆధారంగా అధికారులు వారికి పనులు ఇచ్చేశారు. ఈసీజీ సేవలు, ఇంకా టోల్ ఫ్రీ సేవల కోసం వారికి నామినేషన్ పద్ధతిలో పనులు ఇచ్చారు. ఇవన్నీ పక్కా ఆధారాలతో లభించడం వల్లే అచ్చెన్నాయుడిని అరెస్టు చేశామని ఏసీబీ చెబుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: