టిడిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు... తెలుగుదేశం సీనియర్ లీడర్ కింజారపు అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్నప్పుడు ఏపీ ఈఎస్ఐలో మందులు, వైద్య పరికరాల కొనుగోళ్ల విషయంలో రూ.150 కోట్ల స్కామ్ జరిగిందని ఏసీబీ అధికారులు కొన్ని వారాల క్రితం గుర్తించారు. అయితే ఈ రోజు ఉదయం 6 గంటల 45 నిమిషాలకు ఈఎస్ఐ స్కాం లో టెక్కలి నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన అచ్చెన్నాయుడి పాత్ర ఉందనే అనుమానంతో... అతడిని నిమ్మాడ వద్ద పోలీసులు అరెస్టు చేయగా... ఈఎస్ఐ స్కాం విషయంపై దర్యాప్తు చేసేందుకు అతడిని అదుపులోకి తీసుకున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు. 


ఈఎస్ఐ రికార్డులను తారుమారు చేసి మంత్రి అచ్చెన్నాయుడు పాత్ర ఉందని వైసిపి కావాలనే అతడిని అరెస్టు చేయించిందని టిడిపి నేతలు అందరూ వైసిపి తీరుపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీమంత్రి టీడీపీ నేత ఆలపాటి రాజా కూడా అచ్చెన్నాయుడు అరెస్ట్ పై చాలా వ్యాఖ్యలు చేశాడు. 


శుక్రవారం రోజు అచ్చెన్నాయుడు అరెస్ట్ పై స్పందించిన ఆలపాటి రాజా... అచ్చెన్నాయుడి ని అరెస్టు చేయడం వైసిపి పార్టీ కక్షసాధింపు చర్యలకు నిదర్శనమని, టిడిపి పార్టీ స్థాపించిన రోజు నుండి ఎర్రన్నాయుడు కుటుంబం ప్రజల సంక్షేమం కొరకు చాలా యాక్టివ్ గా పనిచేస్తుందని, ఆ కుటుంబం లో నుండి వచ్చిన నేతలంతా బీసీ కులాల వర్గాలకు మార్గదర్శకులుగా పని చేస్తున్నారని కానీ ఎర్రన్నాయుడు కుటుంబం రాజకీయాల్లో కొనసాగకుండా చేయాలనే ఉద్దేశంతో వైసిపి ప్రభుత్వం కుట్రపన్నుతోందని ఆయన ఆరోపించారు. 


ఈనెల 16వ తేదీన అసెంబ్లీ సమావేశాలలో అచ్చెన్నాయుడు హాజరైతే... ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తాడో అన్న భయంతో అతడిని వైసీపీ ప్రభుత్వం కావాలనే అరెస్టు చేయించిందని ఆయన ఫైర్ అయ్యారు. ఈఎస్ఐ స్కామ్ లో రికార్డులను తారుమారు చేసి టిడిపి పార్టీకి మలినం అంటించడానికి వైసిపి ప్రయత్నిస్తుందని ఆయన పేర్కొన్నారు. బీసీ నాయకుడైన అచ్చెన్నాయుడిని అరెస్టు చేయడం అప్రజాస్వామికమని... అతడి అరెస్టు ని బీసీలపై దాడిగా భావించాలని ఆయన ధ్వజమెత్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: