మనం రోజూ కరెన్సీ నోట్లు చూస్తూనే ఉంటాం. 2 వేల రూపాయల నోటు జేబులో ఉంటే ఆ ధీమాయే వేరు. ఇక మన అవసరాలను బట్టి అంతో ఇంతో జేబులో నోట్లు కుక్కుకుని బజారుకు వెళ్తుంటాం. ఆన్ లైన్ లావాదేవీలు పెరిగినా.. ఇంకా మన ఇండియాలో కరెన్సీ కూడా బాగానే మార్కెట్లో చక్కర్లు కొడుతుంది.

 

 

అయితే ఈ నోట్లలో ఏ నోటు తయారు చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుందో తెలుసా.. దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా.. మీరు ఆలోచించలేదేమో కానీ.. సూర్యాపేటకు చెందిన జలగం సుధీర్ అనే కుర్రాడికి ఈ సందేహం వచ్చింది. డౌట్ వస్తే వెంటనే క్లియర్ చేసుకోవాలనుకున్న సుధీర్.. సమాచార హక్కు చట్టం కింద ఏ కరెన్సీకి ఎంత ఖర్చువుతుందో చెప్పాలని ప్రశ్నించాడు.

 

 

సమాచార హక్కు చట్టం కింద అడిగితే చెప్పక తప్పుతుందా.. 2019-20 ఆర్థిక సంవత్సరంలో నోట్ల ముద్రణకు అయిన ఖర్చుల వివరాలను ఆర్‌బీఐ అతనికి పంపింది. ఈ సమాచారం ప్రకారం. ఉన్న అన్ని నోట్ల కంటే.. రూ. 200 నోటు తయారీకి ఎక్కువగా ఖర్చు అవుతుందట. ఒక్క రూ.200 నోటు ప్రింటు చేయాలంటే.. రూ.2.15 చొప్పున ఖర్చు అవుతుందట. అదే రూ.500 నోటు అయితే రూ.2.13 ఖర్చు అవుతుందట.

 

 

ఇక రూ.100 నోటుకి రూ.1.34 ఖర్చు అవుతుందట. రూ.50 నోటుకు 82 పైసలు ఖర్చు అవుతుందట. రూ.20 నోటుకు 85 పైసల చొప్పున ముద్రణ కోసం ఖర్చు అవుతుందట. అన్నింటి కంటే చౌకగా రూ.10 నోటుకు 75 పైసలు ఖర్చవుతుందట. అంతా బాగానే చెప్పింది కానీ.. మరి రూ. 2000 నోటు సంగతేంటి అంటారా.. ఈ నోటు 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఒక్కటి కూడా ప్రింటు చేయలేదట. అందుకే ఆ వివరాలు మాత్రం చెప్పలేదు. అది కరెన్సీ నోట్ల ముద్రణ ఖర్చు సంగతి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: